ఎంతటి బిజీలైఫ్ లో ఉన్నా.. దైవ దర్శనం మనసుకు ప్రశాంతతనిస్తుంది. అందుకే కనీసం వారానికి ఒక్కసారనై ఆలయానికి వెళ్లాలి. దైవ దర్శనం చేసుకోవాలి. అయితే.. దైవ దర్శనం కోసం.. ఆలయానికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు కూడా చేయడం సాంప్రదాయం..
కానీ ఈ ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి.. ఒక్కసారా.. రెండుసార్లా.. మూడు సార్లా.. ఈ విషయంపై చాలామందికి స్పష్టత ఉండదు. కానీ.. సాధారణంగా మూడు మారులు ప్రదక్షిణం చేయటం సంప్రదాయం. దీనికి కూడా ఓ కారణం ఉంది.
మూడు సంఖ్య సత్త్వ రాజ స్తమోగుణాలని, భూర్భువస్సువర్లోకాలని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలని సూచిస్తుంది. మామూలుగా ప్రదక్షిణం చేసేప్పుడు చేతులు రెండు జోడించి నమస్కార ముద్రతోనే చేస్తారు. దేవాలయంలో గర్భగుడి ధ్వజ స్తంభాల చుట్టూ ఉంటుంది ప్రదక్షిణం. అరుణా చలం వంటి క్షేత్రాలలో కొండ మొత్తానికి ప్రదక్షిణం చేస్తారు. దానిని గిరి ప్రదక్షిణం అంటారు.
దీనిని మొదట ప్రారంభించింది శ్రీకృష్ణుడే అని చెప్పవచ్చు. ఇంద్ర యాగం మానిపించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమని చెప్పి చేయించాడు. దానివల్ల ఎంతటి సత్ఫలితం వచ్చిందో స్పష్టమే కదా! అందుకే ఆలయానికి వెళ్లినప్పుడు మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి.