జపం.. ఇది సర్వశ్రేష్ఠం. కానీ ఆచరించే విధానం పెద్దల నుంచి తెలుసుకొని జపం చేయాలి. శాస్త్రలలో పేర్కొన్న కొన్ని అంశాలను తెలుసుకుందాం… తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు కింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.
“త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా
తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే”!!
అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి.
ఏ ఆసనాల మీద చేస్తే ఏం ఫలమో తెలుసా!!
జపాన్ని చేయడానికి పైన పేర్కొన్న వాటితో పాటు ఆసనాలు కూడా చాలా ముఖ్యమే. ఆయా ఆసనాల వల్ల ఆయా ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు విద్యుత్ బాగా ప్రసరించాలంటే రాగి అత్యుత్తమం. తర్వాత వెండి.. ఇలా రకరకాల వాహకాల ద్వారా విద్యుత్ ప్రవహించే శక్తి ఆధారపడి ఉంటుంది. అలానే జపం చేసినప్పుడు కూడా మనం ఉపయోగించే ఆసనాలు కూడా ప్రధానమైనవనే పండితులు చెప్తున్నారు. ఆ వివరాలు చూద్దాం….
వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్య్రం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం రుక్, సామవేదాలకు ప్రతినిధిగా పేర్కొంటారు.
దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.
గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు.
జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో ’పగడాల మాల’ కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.
– కేశవ