ధ‌ర్మ సందేహం: వెంక‌టేశ్వ‌రుడు అనాలా.. వేంక‌టేశ్వ‌రుడు అనాలా…?

-

సాధార‌ణ ధర్మ సందేహాల్లో ఇది త‌ర‌చుగా అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెట్టే సందేహం. కొండ‌ల‌లో నెల‌కొన్న‌ కోనేటిరాయుని పేరును ఎలా ప‌ల‌కాలి? ఎలా రాయాలి? అనే విష‌యంపై ఇప్ప‌టికీ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అవగాహ‌న‌లేద‌నే చెప్పాలి. హిందూ ధ‌ర్మాన్ని ఆచ‌రించే ప్ర‌తి వంద‌ కుటుంబాల్లోనూ ఎంత లేద‌న్నా స‌గానికి స‌గం కుటుంబాలు త‌మ పిల్ల‌లకు శ్రీవారి పేరును పెట్టుకోవ‌డం తెలిసిందే. క‌లియుగ నాధుడు, ఆనంద నిల‌య సుధాముడు అంటూ ఆయ‌న‌ను కొనియాడ‌కుండా ఉండ‌లేం. అటువంటి శ్రీవారి పేరును పెట్టుకున్న వారు కూడా వెంక‌టేశ్వ‌ర‌రావు అని పిల‌వాలా?  వేంక‌టేశ్వ‌ర‌రావు అని పిల‌వాలా? అనే సందేహంలో తేలియాడుతూ ఉంటారు. వాడుక భాష‌లో వెంక‌టేశ్వ‌ర‌రావు అన్నా త‌ప్పులేద‌నే వారు ఉన్న‌ప్ప‌టికీ.. దీని వెనుక అంత‌రార్థం తెలుసుకుంటే.. `వాస్త‌వం` బోధ‌ప‌డుతుంది.

ఇక‌, `వేంక‌టేశ్వ‌రుడు`-అనే పేరును ప‌ల‌క‌డం, రాయ‌‌డంపైనే కాదు.. అస‌లు ఇది తెలుగు భాష నుంచి వ‌చ్చిన‌ పేరా? స‌ంస్కృత భాష నుంచి వ‌చ్చిన పేరా? అనే సందేహం వ్య‌క్తం చేసేవారు కూడా ఉన్నారు. నిత్యం ల‌క్ష‌ల మంది అనేక వ్య‌యప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని మ‌రీ తిరుమ‌ల‌కు చేరి శ్రీవారిని ఆపాద‌మ‌స్త‌కం ద‌ర్శించి త‌రించాల‌ని ఉవ్విళ్లూరే వారిలో స‌గానికిపైగా ఈ విష‌యాల‌పై సందేహాలు వ్య‌క్తం చేస్తున్న విష‌యం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు. ఈ సందేహాల‌కు శ్రీవారి ప్రియ భ‌క్తురాలు.. త‌రిగొండ వెంగ‌మాంబ తాను రాసుకున్న `వేంక‌టేశ్వ‌ర మ‌హ‌త్యం` పుస్త‌కంలో స‌వివ‌ర‌ణ ఇచ్చారు. శ్రీవారికి శ్రీవేంక‌టేశ్వ‌రుడు అనే పేరు ఎందుకు వ‌చ్చిందో కూడా చెప్పుకొన్నారు.

వెంగ‌మాంబ‌గారే కాదు.. `తిరుమ‌ల ద‌ర్శ‌నం` అనే ప్ర‌సిద్ధ గ్రంధంలోనూ శ్రీవారి పేరుపై వివ‌ర‌ణ ఉంది. దీని ప్ర‌కారం శ్రీవారిని “వేంక‌టేశ్వ‌రుడు“ అనే పిలుచుకోవాలి. కుటుంబాల్లోని పిల్ల‌ల‌కు ఈ పేరు పెట్టుకున్నవారు ఇలానే పిలుచుకోవాలి. ఇక‌, ఈ పేరు సంస్కృత భాష నుంచి ఉద్భ‌వించింది. వేం-అంటే పాపం. క‌ట‌-అంటే తీసేయ‌డం లేదా తొల‌గించ‌డం. అంటే.. మ‌నం చేసిన పాపాల‌ను గోవిందా..గోవిందా..గోవిందా.. అన్న నామ‌స్మ‌ర‌ణ ద్వారా తొల‌గించేవాడు క‌నుక‌నే ఆయ‌న‌కు వేంక‌టేశ్వ‌రుడు అనే పేరు వ‌చ్చింద‌ని వెంగ‌మాంబ‌గారి వివ‌ర‌ణ‌.

ఇక‌, తిరుమ‌ల ద‌ర్శ‌నం పుస్త‌కం ప్ర‌కారం “వేం క‌ట‌తే ఇతి.. వేంక‌టేశ్వ‌ర‌“ అని వేంక‌టేశ్వ‌రుని నామానికి అర్థం చెప్పారు. అంటే మ‌న పాపాల‌ను తొల‌గించే నాథుడని!! ఈ రెండు పుస్త‌కాలు కూడా తిరుమ‌ల రాయుని చ‌రిత్ర‌ను తెలుసుకునేందుకు అత్య‌ద్భుత ప్రామాణిక గ్రంథాలుగా పెద్ద‌లు చెబుతారు. దీనిని బ‌ట్టి.. వెంక‌టేశ్వర కాదు.. వేంక‌టేశ్వ‌ర అనేది సరైన‌ది, మ‌న‌ల‌ను త‌రింపజేసేది అని స్ప‌ష్ట‌మ‌వుతోంది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version