హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్ వేద’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి ఓ న్యూస్ ప్రస్తుతం బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్రబృదం సిద్ధమైంది. ఏకంగా 100 దేశాల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ లాంటి 22 యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికాలోని 27 దేశాల్లోనూ విడుదల కానుంది. వీటిలో బాలీవుడ్‌కు అంతగా పట్టులేని జపాన్, రష్యా, పెరూ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం గురించి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ఓవర్సీస్ బిజినెస్ అధినేత ధ్రువ సిన్హా మాట్లాడుతూ..‘‘విక్రమ్ వేద సినిమాను అందరూ ఆదరిస్తారు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’కు రీమేక్ ఇది. మాతృకను తెరకెక్కించిన పుష్కర్, గాయత్రి ద్వయమే ఈ హిందీ సినిమాకూ దర్శకత్వం వహించింది. ఎస్. శశికాంత్, భూషణ్ కుమార్ నిర్మించారు. రాధికా ఆప్టే కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 30న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.