సాగర్ లో పెద్ద ఎత్తున నామినేషన్లు..ఏ పార్టీకి లాభం..ఎవరికి నష్టం

-

తెలంగాణలో అందరి దృష్టి ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఉంది. అయితే ప్రధాన పార్టీలకు స్వతంత్ర అభ్యర్థుల బెంగ పట్టుకుంది. మొత్తం 78 అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌లు కుల సమీకరణాల ఆధారంగా ముందుకెళ్తుండటంతో ఇండిపెండెంట్లుగా వేసినవారు ఎంత ప్రభావం చూపుతారన్నది అంతుచిక్కడం లేదట. నాగార్జునసాగర్‌లో భారీగా నామినేషన్లు దాఖలు కావడం ఇప్పుడు రాజకీయ పార్టీలను కలవర పెడుతుంది. పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు రంగంలో ఉంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న లెక్కలేస్తున్నాయి ప్రధాన పార్టీలు.

సాగర్ నియోజకవర్గంలో 2,19,745 ఓట్లున్నాయి. ఇందులో 40 వేల ఓట్లు గిరిజనులవే. 35 వేల ఓట్లు యాదవ సామాజికవర్గానికి చెందినవి. ఓసీల ఓట్లు 31వేలు ఉండగా ఇందులో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఓట్లే అధికం. ఎస్సీలలో మాదిగ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 25 వేల వరకు ఉన్నారట. పోటీలో ఉన్న మూడు పార్టీల అభ్యర్థులు తమ సామాజికవర్గాల నుంచి ఏ మేరకు ఓట్లను సాధిస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. 2014 ఎన్నికల్లో జానారెడ్డికి 69 వేల 684 ఓట్లు వస్తే.. నోములకు 53వేల 208 ఓట్లే వచ్చాయి. 2018 ముందస్తు ఎన్నికలకు వచ్చే సరికి నోముల 83 వేల 655 ఓట్లు సాధించారు. జానారెడ్డి 75 వేల 884 ఓట్లతో సరిపెట్టుకున్నారు.

2014 కంటే 2018కి ఓట్లు పెరిగినా.. అభ్యర్థుల జాతకాలు తిరగబడ్డాయి. 2018లో బరిలో ఉన్న ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థికి 9 వేల 819, బీజేపీ అభ్యర్థి నివేదితకు 2 వేల 675 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు స్వతంత్రులు పెరిగారు. పైగా మాదిగ సామాజికవర్గం ఎటు మొగ్గు చూపుతుందన్నది ప్రశ్నగా ఉంది. ఎమ్మార్పీఎస్‌ నుంచి నామినేషన్లు పడటంతో ఆ ఓట్లు ప్రధాన పార్టీలకు వచ్చేది కష్టమే. 2014లో మహాజన సోషలిస్ట్‌ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 4 వేల ఓట్లు వచ్చాయి. నాడు మాదిగ సామాజికవర్గం నుంచే ఎక్కువ ఓట్లు పడ్డట్టు భావించారు. ఇప్పుడు కూడా అదే జరిగితే రేస్‌లో ఉన్న పార్టీలకి ఇబ్బంది తప్పకపోవచ్చు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్రులు గట్టి పోటీ ఇవ్వడంతో.. సాగర్‌లో కూడా బరిలో ఉన్న కొందరు ఇండిపెండెంట్‌లు ఆ దిశగా ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నారట. ఇది తెలిసినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ శిబిరాల్లో గుబులు మొదలైందట. దుబ్బాకలో బీజేపీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. అందుకే సాగర్‌లో పార్టీలకు పడే ప్రతి ఓటు కీలకమే. ఏ పార్టీ కూడా ఛాన్స్‌ తీసుకునేందుకు సిద్ధంగా లేదు. మెజారిటీని పక్కనపెట్టి ఓటర్లను ఆకర్షించడం.. వారి ఓట్లు పడేట్టు జాగ్రత్తలు తీసుకోవడంపైనే ఎక్కువగా ఫోకస్‌ పెట్టాయట పార్టీలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version