రోజు రోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతోంది. భానుడి భగభగలకు ప్రజలు చెమటలు కక్కుతున్నారు. కూలర్లు.. ఏసీలు.. హై లో పెట్టినా సూర్యుడి ప్రతాపం ముందు చిన్నబోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రజల్ని హెచ్చరించింది విపత్తుల నిర్వహణ సంస్థ. ఇవాళ 14 మండలాల్లో తీవ్ర వడగాల్పుల.. 102 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేద్కర్. రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అల్లూరిసీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అడ్డతీగల మండలాలు.. అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం మండలాలు.. కాకినాడ జిల్లాలో కోటనండూరు పల్నాడు జిల్లాలో అమరావతి మండలం.. పార్వతీపురంమన్యం జిల్లాలో భామిని,కొమరాడ, గుమ్మలక్ష్మీపురం,కురుపాం, సాలూరు మండలాలు.. విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 12 మండలాలు, అనకాపల్లిలో 11 మండలాలు , పల్నాడులో 11 మండలాలు , వైఎస్ఆర్ జిల్లాలో 11 మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో 9, విజయనగరం జిల్లాలో 8 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. మిగిలిన చోట్ల మొత్తం 102 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరికొంత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు కొంచెం అటూ ఇటుగా ఉంటాయని చెబుతున్నారు.