హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో ప్రజాదీవెన సభకు ఈ మార్గానే వెళ్తున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నందున పోలీసులు ట్రాఫిక్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. ప్రజలను ఆ మార్గంలో వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు.
నగరంలోని హబ్సీగూడ నుంచి యాదాద్రి జిల్లా చౌటుప్పల్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎల్బీనగర్ వద్ద విద్యుత్ తీగలు కిందకు వేలాడటంతో దాదాపు 41 నిమిషాలు రాకపోకలు నిలిచిపోయాయి. సీఎం కాన్వాయ్‌తో ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయాలకు వెళ్లే వారు, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న వారు ట్రాఫిక్‌లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు.
మునుగోడు ప్రజా దీవెన సభకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి వెళ్లారు. పార్టీ శ్రేణులతో కలిసి సీఎం బస్సులో వెళ్తున్నారు. పార్టీ నేతల భారీ కాన్వాయ్ సీఎం వెంట వస్తోంది. ప్రగతి భవన్ నుంచి మునుగోడు వరకు ఆయా ప్రాంతాల్లో.. భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. సీఎం వెళ్లే మార్గమంతా పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సందడిగా నెలకొంది.