లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు పోలీసులు ఊరట కలిగించే విషయం చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో సీజ్ చేయబడిన వాహనాలను తిరిగి అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 34వేల వాహనాలను సీజ్ నుంచి విడిపించామని, వాటిని వాహనదారులకు అందజేస్తామని తెలిపారు.
ఈస్ట్ జోన్‌లో 9వేల బైక్‌లు, వెస్ట్ జోన్‌లో 13వేల బైక్‌లు, సౌత్ జోన్‌లో 8వేలు, నార్త్ జోన్‌లో 1700, సెంట్రల్ జోన్‌లో 2200 బైక్‌లను విడుదల చేశామని.. వాటిని వాహనదారులకు అప్పగిస్తున్నామని పోలీసులు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రహదారులపైకి వచ్చినందుకు గాను వాహనాలను పోలీసులు గతంలో సీజ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ వాహనాలను తిరిగి యజమానులకు అప్పగిస్తున్నారు.
వాహనదారులు తమ వాహనాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. అయితే మొదట్లో లాక్‌డౌన్ తర్వాతే వాహనాలను వెనక్కి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం లాక్‌డౌన్ ముగియకుండానే పోలీసులు వాహనాలను అప్పగిస్తుండడం విశేషం. అయితే వాహనాలను అప్పగించినప్పటికీ పౌరులు మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని, ఇండ్లలోనే ఉండాలని సీపీ అంజనీ కుమార్ కోరారు.