అందుకే కిడ్నాప్ చేశా.. వైశాలి అపహరణ కేసులో నవీన్ రెడ్డి

-

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో డెంటిస్ట్ వైశాలి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్‌రెడ్డి  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 9న యువతిని కిడ్నాప్‌ చేసిన అతడు నల్గొండ వెళ్లే మార్గంలో ఆమెను వదిలేసి గోవా చేరాడు. అక్కడ హోటల్‌లో బస చేశాడు. హోటల్‌లోని రూమ్‌ బాయ్‌ ద్వారా వీడియో తీయించాడు. దాన్ని పెన్‌డ్రైవ్‌లో ఉంచి.. హైదరాబాద్‌కు వస్తున్న బస్‌డ్రైవర్‌కు అప్పగించాడు. ఇవాళ ఉదయం ఆ వీడియో సామాజిక మాధ్యమాల ద్వారా మీడియాకు చేరింది. 58 నిమిషాల వ్యవధి గల వీడియో ద్వారా నవీన్‌రెడ్డి పలు అంశాలు వివరించాడు.

‘‘ఎంతో కాలంగా మేమిద్దరం కలిసి తిరిగాం. ఆమె తల్లిదండ్రులే మమ్మల్ని దూరం చేశారు. సన్నిహితంగా ఉన్న మమ్మల్నిద్దర్నీ దూరం చేసేందుకు యువతి మేనమామ, తల్లి పన్నాగం వేశారు. 5-6 నెలలు తనను కలవకుండా దూరం చేశారు. ఇంటికెళ్లినా, కళాశాలకు వెళ్లి మాట్లాడేందుకు ప్రయత్నించినా పోలీసు కేసుతో భయపెట్టారు. కొద్దిరోజులుగా ఆమెకు ఎన్నారై పెళ్లి సంబంధాలు వస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 9న మన్నెగూడలోని యువతి ఇంట్లో నిశ్చితార్థం జరగబోతోందని 8వ తేదీ రాత్రి తెలిసింది. దాన్ని అడ్డుకొని ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్లాను. ‘మిస్టర్‌ టీ’ దుకాణాల్లో పనిచేసే 20 మందిని సహాయంగా తీసుకొని యువతి ఇంటికి చేరాను. ఆమెతో మాట్లాడాలనే ఉద్దేశంతో బలవంతంగా కారులోకి ఎక్కించుకొని తీసుకెళ్లాను. రెండుసార్లు ఆ యువతి కారులో నుంచి దూకేందుకు ప్రయత్నించటంతో ఆపాను. కొట్టలేదు. ముఖాన్ని వెనక్కి నెట్టినపుడు గోరు తాకింది.’’ అని నవీన్ రెడ్డి చెప్పాడు.

పర్యాటక ప్రాంతాలకు తాము కలసి వెళ్లిన అంశాలను నవీన్ పంచుకున్నాడు. కిడ్నాప్‌ చేశాక ఆమె ఇంటి వద్దే వదిలేద్దామని భావించినా, పోలీసులకు లొంగిపోతే ప్రమాదకరమనే ఉద్దేశంతో న్యాయవాది సలహా కోసం ప్రయత్నించినట్టు పేర్కొన్నాడు. సమయానికి ఆ న్యాయవాది స్పందించకపోవటంతో యువతిని మార్గం మధ్యలో వదిలేసి వెళ్లినట్టు తెలిపాడు. ఇంతకాలంగా తమ మధ్య జరిగిన విషయాలు బయటి ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతోనే వీడియో తీసి పంపానంటూ పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version