రాయబరేలి నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు.లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియాగాంధీ రాయబరేలిలో పాల్గొన్నారు.సోనియాగాంధీతో పాటు ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు.
”చాలా కాలం తర్వాత మీ మధ్యకు రాగలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందని,ఎంపీగా మీకు సేవలందించే అవకాశం కల్పించడాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. గత వందేళ్లుగా ఈ గడ్డతో మా కుటుంబ అనుబంధం వేళ్లూనుకుని ఉంది. ఈ అనుబంధం గంగాజలంలా స్వచ్ఛమైనది. రాయబరేలి ప్రజలు, ఇందిరా గాంధీ ద్వారా తాను నేర్చుకున్న పాఠాలే తన పిల్లలైన రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీకి నేర్పానని అన్నారు .రాయబరేలి ప్రజలకు ఇందిరాగాంధీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేదని, ఆమె పనితీరును తాను చాలా దగ్గర నుంచి పరిశీలించానని, ఇక్కడి ప్రజలంటే ఆమెకు ఎనలేని అభిమానం ఉండేదన్నారు సోనియాగాంధీ. అందరినీ గౌరవించడం, బలహీనులను పరిరక్షించడం, ప్రజల హక్కులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడటం, ఎలాంటి భయాలకు తావీయకుండటం వంటి పాఠాలు వారికి నేర్పానని తెలిపారు.