ఇటీవల తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. రైల్లో ప్రయాణించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తున్నాయి. ఇప్పటికే పలు రైలు ప్రమాదాల్లో వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీలో మరో రైలు ప్రమాదం ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. విజయనగరం రైల్వే స్టేషన్ స్టేషన్ యార్డ్ (బైపాస్) వద్ద నాగావళి సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20810) ఇవాళ పట్టాలు తప్పింది.
విశాఖ నుంచి విజయనగరం చేరుకుని సంబల్‌పూర్ వెళ్లేందుకు 11.40 గంటలకు బయలు దేరిన రైలు.. క్షణాల వ్యవధిలోనే స్టేషన్ సమీపంలో వెంకటలక్ష్మీ థియేటర్ కూడలి వద్ద చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హానీ జరగలేదు. రైలు నెమ్మదిగా వెళ్లడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన భోగీలను తప్పించి మిగిలిన రైలును యథావిధిగా పంపించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.