వరల్డ్‌కప్ లీగ్ దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు 3, 4 స్థానాల్లో నిలిచాయి. అయినప్పటికీ ఆ జట్లు 1, 2 స్థానాల్లో ఉన్న భారత్, ఆస్ట్రేలియాలను ఓడించి ఫైనల్‌కు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో విశ్వవిజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఇంగ్లండ్‌లోని లండన్ లార్డ్స్ మైదానంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. 2015 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోగా.. కనీసం ఈసారైన కప్ సాధించాలని కివీస్ ఆరాటపడుతోంది. మరోవైపు ప్రపంచకప్‌లలో 4వ సారి ఫైనల్స్‌కు చేరిన ఇంగ్లండ్ ఈసారైనా ట్రోఫీని చేజిక్కించుకోవాలని చూస్తోంది.
వరల్డ్‌కప్ లీగ్ దశలో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లు 3, 4 స్థానాల్లో నిలిచాయి. అయినప్పటికీ ఆ జట్లు 1, 2 స్థానాల్లో ఉన్న భారత్, ఆస్ట్రేలియాలను ఓడించి ఫైనల్‌కు చేరుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మాజీ చాంపియన్లను ఆ రెండు జట్లు చిత్తు చేసి ఇవాళ ఫైనల్ పోరులో తలడనున్నాయి. ఈ క్రమంలోనే ఈసారి కొత్త విజేతను చూసే భాగ్యం అభిమానులకు దక్కింది. వరల్డ్ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాదే ఎప్పటి నుంచో గుత్తాధిపత్యం కొనసాగుతూ వస్తోంది. మధ్యలో ఇండియా, పాక్, శ్రీలంకలు కప్‌ను సాధించినా.. ఓవరాల్‌గా చూస్తే ఆస్ట్రేలియానే వరల్డ్ కప్ చాంపియన్‌గా ఉంటూ వస్తోంది. కానీ ఈసారి ఆ జట్టు సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఇంగ్లండ్ ఇప్పుడు కప్‌ను పొందగల అన్ని అర్హతలు ఉన్న జట్టుగా నిలిచింది.
అయితే ఇంగ్లండ్, న్యూజిలాండ్ రెండు జట్లకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ రాలేదు. దీంతో మనం ఈసారి కొత్త చాంపియన్‌ను చూడబోతున్నామని అభిమానులు ఒకింత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే వన్డే రికార్డులను ఒకసారి చూస్తే ఇంగ్లండ్, న్యూజిలాండ్ రెండు జట్లు ఈ ఫార్మాట్‌లో దాదాపుగా సమ ఉజ్జీలుగా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 90 వన్డేల్లో తలపడగా వాటిల్లో కివీస్ 43 మ్యాచ్‌లలో, ఇంగ్లండ్ 41 మ్యాచ్‌లలో విజయాలను సాధించాయి. అంటే దాదాపుగా రెండు జట్లు వన్డే మ్యాచ్‌లలో పోటీ పడితే పోరు హోరా హోరీగా ఉంటుందన్నమాట. ఇరు జట్లు వన్డేల్లో తలపడినప్పుడు దాదాపుగా ఈ రెండు జట్లూ సమ ఉజ్జీలుగా ఉన్నాయని మనకు ముందు చెప్పిన గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. కాగా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లీగ్ దశలో న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించడం ఇంగ్లండ్‌కు అనుకూలాంగా మారింది. మరి ఇవాళ జరగనున్న పోరులో విశ్వ విజేతగా ఏ జట్టు నిలుస్తుందో చూడాలి..!