కరోనాకి వ్యాక్సిన్ ను ఆగస్టు 15 నాటికి మార్కెట్లోకి విడుదల చేస్తామని ఐసీఎంఆర్, బీబీఐఎల్ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. ఈ వ్యాక్సిన్ జంతువుల్లో పూర్తి సత్ఫలితాలను ఇవ్వగా, ప్రస్తుతం మానవ దశలో ఉందని వెల్లడించింది. కాగా క్లినికల్ ట్రయల్స్ కోసం తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 ఇనిస్టిట్యూట్ లలో వ్యాక్సిన్ పనితీరును పరిశీలిస్తామని, అన్ని క్లినికల్ ట్రయల్స్ ఆగస్టు మొదటి వారానికి పూర్తవుతాయని తెలియజేశాయి.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రిని (కేజీహెచ్) ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు నోడల్ అధికారిగా కేజీహెచ్ వైద్యుడు డాక్టర్ వాసుదేవ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐసీఎంఆర్ అనుమతులు ఇచ్చింది. ఇక్కడ పరీక్షలకు నోడల్ అధికారిగా డాక్టర్ ప్రభాకర్ రెడ్డిని నియమించింది.