టీడీపీలో భిన్నమైన స్టయిల్‌తో దూసుకుపోతున్నారు గుంటూరుకు చెందిన సీనియర్ నాయకుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు. వరుస విజయాలు సాధించిన ఆయన టీడీపీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఆయన వినుకొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఈ క్రమంలోనే అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నారు. నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోనే వెనకపడిన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న వినుకొండలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగి.. ప్రజల వద్దకు ఇంటింటికీ.. నీటిని తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే ప్రజల మనసు దోచుకున్నారు. ఇక, పార్టీ పరంగానూ ఆయన దూకుడుగా ఉన్నారు.
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన అందరికీ తలలో నాలుకగా వ్యవహరించారు. పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేశారు. అయితే, గత ఏడాది ఎన్నికల సమయంలో వైసీపీ తుఫాను నేపథ్యంలో జీవీ వరుస విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నా.. సాధ్యం కాలేదు. సరే.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమే కనుక.. ఆయన త్వరలోనే ఓటమి భారం నుంచి బయటపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వరుస మీడియా సమావేశాలు పెట్టి.. వినుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి ఉదాశీనత, నియోజకవర్గంలో ముందుకు సాగని పనులు, అభివృద్ధి లేమి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు వంటివాటిని ప్రజలకు వివరించారు.
అదే సమయంలో నియోజకవర్గంలో సాగుతున్న అవినీతి తంతును కూడా జీవీ ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో సాగుతున్న అవినీతిని ఆయన కుండబద్దలు కొట్టారు. పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించారు. వినిపిస్తున్నారు కూడా. వాస్తవానికి ఇదే గుంటూరు జిల్లాలో టీడీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కలేని నాయకులు ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. వారు ఎవరినీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై దూకుడు కూడా ప్రదర్శించడం లేదు. కానీ, జీవీ మాత్రం దీనికి భిన్నంగా.. ఓడి గెలిచిన నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు సంపాయించుకున్నారు.
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే..జిల్లా పై పట్టు సాధించి.. పరుగులు పెట్టించారో.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో దూకుడుగా ముందుకు సాగుతుండడం గమనార్హం. ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న జీవీ దూకుడు అధికార పార్టీ వాళ్లకు చెమటలు పట్టిస్తుండగా… టీడీపీలో రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుల్లోనూ, ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ అయ్యారు.