తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ సీఎం అవ్వాలనే డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. తెరాస పార్టీలో కేటీఆర్ సీఎం అవ్వాలని చాలా మంది కోరస్ పాడుతున్నారు. ఆయా కార్యక్రమాల సందర్బంగా బహిరంగంగానే వేదికలపై కేటీఆర్ పక్కనే ఉండగా ఆయనే సీఎం కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాటికి కేటీఆర్ కూడా స్పందించకపోతుండడంతో ఇక త్వరలోనే ఆయన సీఎం అవుతారని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే మంత్రి కేటీఆర్ సీఎం అవనున్నారనే విషయం దాదాపుగా స్పష్టమవుతుండగా.. ఇప్పుడాయన సీఎం అయితే తెరాసకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అవుతారు ? పార్టీ బాధ్యతలను ఎవరు చూసుకుంటారు ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేటీఆర్ సీఎం అయితే ఎమ్మెల్సీ కవితకు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వస్తుందని, ఆమె పార్టీ బాధ్యతలను చూసుకుంటారని తెలుస్తోంది. మరి.. హరీష్ రావు పరిస్థితి ఏమిటి ? అంటే.. ఆయనకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తారని సమాచారం. మరి అప్పటికే అందులో ఉన్న బోయిన్‌పల్లి వినోద రావు పరిస్థితి ఏమిటి ? అంటే.. ఆయనకు కేటీఆర్ తన కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
అయితే పైన చెప్పినట్లుగానే నిజంగా పదవులన్నింటినీ అలాగే ఇస్తే ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే తెరాస కుటుంబ పార్టీ అయిందని, రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అందువల్ల తమ కుటుంబ సభ్యులకే అన్ని పదవులు ఇవ్వాలా, వద్దా అనే విషయంపై సీఎం కేసీఆర్ ఇప్పుడే నిర్ణయం తీసుకోకపోవచ్చు. ప్రస్తుతానికి కేటీఆర్‌ను సీఎంను చేయడం ఒక్కటే పని, మిగిలినవి తరువాత చూద్దాం అని కూడా భావించవచ్చు. కనుక ఈ విషయాలపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజుల పాటు ఆగాల్సిందే.