వ్యాపారాన్ని డవలప్ చేయడానికి.. రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు పెట్టడం కామన్.. వినియోగదారులను యట్రాక్ట్ చేయడంలో ఇవన్నీ భాగమే.. అలా అనుకోనే.. ఓ వ్యాపారి.. తన దగ్గర ఫోన్ కొన్నవాళ్లకు రెండు బీర్లు ఫ్రీ అన్నాడు. కానీ చివరికి జైలు పాలయ్యాడు.. ఎందుకు ఏమైంది.. బీర్లు ఫ్రీ అనడం తప్పా..?ఉత్తరప్రదేశ్‌లోని భదోహి జిల్లాకు చెందిన రాజేష్ మౌర్య స్మార్ట్‌ఫోన్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. హోలీ సందర్భంగా సేల్స్ పెంచుకోవడానికి ఈ భిన్న స్ట్రాటజీ అమలు చేయాలని చూశాడు. ఒక స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే రెండు బీర్లు ఫ్రీ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు.. పాంప్లెట్లు ప్రింట్ చేయించి పంపిణీ చేశాడు.
‘హోలీ బంపర్ ధమాకా.. ఒక స్మార్ట్ ఫోన్ కొనండి.. రెండు బీర్లు ఉచితంగా పొందండి’ అంటూ పోస్టర్లతో ఆఫర్ గురించి ప్రచారం చేయించాడు. తన దుకాణం బయట కూడా పోస్టర్లు ఏర్పాటు చేయించాడు. అయితే మార్చి 3 నుంచి 7 వరకు మాత్రమే ఈ ఆఫర్ పరిమితి ఉంటుందని షరతు విధించాడు.. రాజేష్ మౌర్య వేసిన ప్లాన్ ఆనోటా ఈనోటా పడి పోలీసుల వరకూ వెళ్లింది..దీంతో వెంటనే అధికారులు కలగజేసుకుని ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఇలాంటి ఆఫర్లు ప్రకటించడం చట్ట విరుద్ధం అంటూ రాజేష్ మౌర్యను హెచ్చరించారు. కానీ అప్పటికే అందరికీ ఆఫర్ గురించి తెలిసిపోవడంతో పెద్దఎత్తున కస్టమర్లు తరలి వచ్చారు. దీంతో రాజేష్ స్టోర్ బయట భారీగా క్యూ లైన్ ఏర్పడింది.ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కస్టమర్లను చెదరగొట్టారు..
షాప్ యజమాని రాజేష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రాజేష్ ప్రకటించిన ఆఫర్ వల్ల స్మార్ట్ ఫోన్ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. కానీ, చివరికి అతడు జైలు పాలు కావల్సి వచ్చింది.కస్టమర్లను ఆకట్టుకునేందుకు లిక్కర్, దాని అనుబంధ ప్రొడక్టులను ఆఫర్ల కింద ప్రకటించకూడదు. ఇది అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోడ్ ఆఫ్ కండక్ట్‌ని ఉల్లంఘించినట్లే అని పోలీసులు తెలిపారు. చట్ట ప్రకారం ఇది నేరం. కేవలం లైసెన్స్ పొందిన యజమానులు మాత్రమే ఈ తరహా ఆఫర్లు ప్రకటించే వీలుంది. పోలీసులు యజమానిని అరెస్ట్ చేసి దుకాణాన్ని సీల్ చేశారు.