కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే డీజీసీఏ అనుమతి పొందిన కార్గో సర్వీసులకు ఎలాంటి షరతులు ఉండబోవని కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో పరిస్థితిని బట్టి కొన్ని అంతర్జాతీయ సర్వీసులను నడిపే అవకాశం కూడా ఉందని తెలిపింది. డొమెస్టిక్ విమాన సర్వీసులకు ఎలాంటి ఇబ్బంది లేదు.
దేశంలో విమాన సర్వీసులు కొనసాగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రాకపోకలను కేంద్రం నిలిపివేసింది. రెండు నెలల విరామం తర్వాత మే 25 నుంచి దేశీయ ప్రయాణికుల విమానాలకు కేంద్రం అనుమతినిచ్చింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.