క‌రోనాపై పోరాటంలో భార‌త్ అంతిమ ద‌శ‌లో ఉంది: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

-

క‌రోనా వైర‌స్‌ను అంతం చేసే చివ‌రి ద‌శ‌లో భార‌త్ ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో రాజ‌కీయాలను ప‌క్క‌న పెట్టాల‌ని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ల వెనుక ఉన్న సైన్స్‌ను ప్ర‌జ‌లు న‌మ్మాల‌ని, త‌మ ద‌గ్గ‌రి వారికి వ్యాక్సిన్లు అందే విధంగా చూడాల‌ని అన్నారు. ఢిల్లీలో ఢిల్లీ మెడిక‌ల్ అసోసియేష‌న్ (డీఎంఏ), ధ‌ర్మ‌శిల నారాయ‌ణ హాస్పిట‌ల్‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఆదివారం నిర్వ‌హించిన 62వ వార్షిక ఢిల్లీ రాష్ట్ర మెడిక‌ల్ స‌ద‌స్సు (మెడికాన్ 2021)కు ముఖ్య అతిథిగా హాజ‌రైన ఆయన మాట్లాడారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 2 కోట్ల కోవిడ్ 19 వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేసిన‌ట్లు మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెలిపారు. రోజుకు ప్ర‌స్తుతం 15 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ల‌ను ఇస్తున్నామ‌ని తెలిపారు. ఇత‌ర దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ల‌కు కొర‌త ఉంద‌ని, కానీ మ‌న దేశంలో ఆ ప‌రిస్థితి లేద‌న్నారు. అలాగే మ‌న దేశంలో అభివృద్ది చేయ‌బ‌డిన వ్యాక్సిన్లు స‌మ‌ర్థవంతంగా ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు. ఇండియ‌న్ వ్యాక్సిన్ల వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని ప్రారంభంలోనే తెలిసిందన్నారు. ఇత‌ర దేశాల వ్యాక్సిన్ల వ‌ల్ల దుష్ప్ర‌భావాలు ఎక్కువగా సంభ‌విస్తున్నాయ‌ని తెలిపారు.

పోలియోకు వ్య‌తిరేకంగా ప్ర‌పంచంలోని చిన్నారులంద‌రికీ వ్యాక్సిన్ వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే పాకిస్థాన్‌, ఆఫ్గ‌నిస్థాన్ వంటి దేశాలు మాత్రం పోలియోను నిర్మూలించ‌డంలో విఫ‌లం అయ్యాయ‌ని తెలిపారు.

ఇత‌ర దేశాల‌లో కోవిడ్ కేసులు పెరుగుతుంటే భార‌త్ లో వ్యాక్సిన్ ను అంద‌రూ తీసుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని, ప్ర‌పంచం మొత్తం మీదా క‌రోనా అంతం కావాల‌ని అన్నారు. అందుకు వ్యాక్సిన్ల‌ను అంద‌రూ తీసుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. ప్ర‌పంచంలోని పేద దేశాలు క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతుంటే అది ఇత‌ర దేశాల‌కు మంచిది కాద‌ని, క‌నుక వారికి కూడా వ్యాక్సిన్ అందేలా చూడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంద‌న్నారు.

ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో భార‌త్ ప్ర‌పంచానికి ఫార్మ‌సీ వేదిక‌గా మారింద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 5.51 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ల‌ను 62 భిన్న దేశాల‌కు పంపించామ‌ని తెలిపారు. మోదీ నాయ‌క‌త్వంలో భార‌త్ స్వ‌యం శ‌క్తిగా ఎదుగుతుంద‌ని, అంత‌ర్జాతీయ స్థాయిలో స‌హ‌కారం అందిస్తున్నామ‌ని తెలిపారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ సాకుతో ఇత‌ర దేశాల నుంచి లాభాల‌ను పొందాల‌ని ఆశించ‌కూడ‌ద‌ని మోదీ అన్నార‌ని, అందుక‌నే ఇత‌ర దేశాల‌కు వ్యాక్సిన్ల‌ను స‌ర‌ఫరా చేస్తున్న‌ట్లు తెలిపారు.

ప్ర‌స్తుతం మ‌నం క‌రోనాను అంతం చేసేందుకు చివ‌రి ద‌శ‌లో ఉన్నామ‌ని అందుకు ప్ర‌తి ఒక్క‌రూ 3 జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అన్నారు. కోవిడ్ టీకాల పంపిణీలో రాజ‌కీయాలు చేయ‌కూడ‌ద‌ని, వ్యాక్సిన్‌ల ప‌ట్ల న‌మ్మకం క‌లిగి ఉండాల‌ని, అంద‌రికీ వ్యాక్సిన్ అందేలా చూడాల‌ని అన్నారు. ఇప్ప‌టికే కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేసేందుకు ప్రైవేటు వారికి కూడా అనుమ‌తులు ఇచ్చామ‌ని అన్నారు. దీంతో రోజుకు 24 గంట‌ల పాటు వ్యాక్సిన్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ జ‌న్ ఆందోళ‌న్‌లో భాగ‌స్వాములు కావాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, ఇత‌రుల‌కు వ్యాక్సిన్‌ను ఇప్పించాల‌ని మంత్రి హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version