చివరి టెస్ట్ మ్యాచ్‌లోనూ ఓడిన భారత్.. 1-4తో సిరీస్ ఓటమి..!

-

అనుకున్నదే జరిగింది.. ఊహించినట్లుగానే భారత్ మళ్లీ ఓడింది. ఇంగ్లండ్‌తో 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ ఓడింది. ఈ సిరీస్‌లో కేవలం ఒక్క టెస్ట్ మ్యాచ్ మాత్రమే గెలిచిన భారత్ మిగిలిన 4 టెస్ట్ మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. వీటిలో మూడింటిలో దారుణ పరాజయాలను చవి చూడగా, చివరి మ్యాచ్‌లోనే కొంత పోరాట పటిమను ప్రదర్శించింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని మొదటి ఇన్నింగ్స్‌లో 332 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 423 పరుగులను చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో 464 పరుగుల ప్రపంచ రికార్డు లక్ష్య ఛేదన కోసం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడగా 345 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియన్ బ్యాట్స్‌మెన్ అందరూ అవుట్ అయ్యారు. కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్‌లు సెంచరీలు సాధించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భారత్ ఓటమిపాలైంది.

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ జరుగుతున్న క్రమంలో ఓ దశలో భారత్ సిరీస్‌ను కోల్పోయినప్పుడు కోచ్ రవిశాస్త్రిపైనే విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ఇండియన్ టీం అంత చెత్త ప్రదర్శన ఇస్తుంటే కోచ్ ఏం చేస్తున్నారని అందరూ మండిపడ్డారు. కానీ రవిశాస్త్రి తన పనితీరును సమర్థించుకున్నాడు. గతంలో కన్నా ఇప్పుడే అత్యంత మెరుగైన టీం ఆడుతుందని శాస్త్రి అన్నాడు. తమను తాము నిరూపించుకుంటామని చెప్పాడు. అయినప్పటికీ భారత్ ఓటమి పాలవడం అభిమానులకు మింగుడు పడడం లేదు. కాగా ఈ నెల 15వ తేదీ నుంచి దుబాయ్‌లో ఆసియా కప్ ప్రారంభం కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌ను ఢీకొనబోతోంది. మరి ఈ కప్‌లో పాకిస్థాన్‌కు గట్టిపోటీనిస్తుందా, ట్రోఫీని ముద్దాడుతుందా, అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version