పోస్టల్ శాఖ ఇక నుంచి బ్యాంకింగ్ సేవలను సైతం ప్రజలకు అందించనుంది. ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) ను శనివారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐపీపీబీ ద్వారా ఉత్తరాలు, పార్శిళ్లను అందించే పోస్ట్ మ్యాన్ ఇక బ్యాంకింగ్ సేవలు సైతం అందించనున్నారని ప్రధాని తెలిపారు. ఇకనుంచి భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని తెలిపారు. డిజిటల్ పేమెంట్లలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 1.55 లక్షల పోస్టాఫీసు శాఖలను ఐపీపీబీ బ్రాంచులుగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత ప్రక్రియ మొత్తం డిసెంబర్ 31 నాటికి పూర్తికానుందని తెలిపారు.