75 వసంతాల భారతంలో.. ఆటుపోట్లు అధిగమిస్తూ ప్రగతిపథంలో అక్షరయాత్ర

-

భారత్‌… ఒకప్పుడు ప్రపంచ దేశాలకు విద్యాధామం. గణితం, ఖగోళం, ఆయుర్వేదం, తత్వం వంటి శాస్త్రాలకు కేంద్ర బిందువు. చైనా, ఇండోనేసియా, కొరియా, జపాన్‌, పర్షియా (ఇరాన్‌), మయన్మార్‌ (బర్మా), టర్కీ (తుర్కియే) తదితర దేశాల విద్యార్థుల కలలకు గమ్యస్థానం. పరాయి పాలనకు చిక్కి ఈ వైభవం చరిత్రగా మిగిలిపోయింది. అక్షరాస్యతలో అట్టడుగు స్థాయి కూలిపోయింది.

బ్రిటిష్‌ పాలన ఆరంభమయ్యే వరకూ మనదైన విద్యావ్యవస్థ సలక్షణంగా కొనసాగింది. ఇంత పెద్ద దేశాన్ని చెరబట్టిన తెల్లదొరలు.. ఇక్కడి విద్యా విధానాన్నీ తమ మనుగడకు అనువుగా మార్చేశారు. ఫలితంగా మనది కాని ఆంగ్లం, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేందుకు మాత్రమే అనువైన బోధన విధానాలు బడులను ఆక్రమించాయి. ఈ చట్రంలో ఇరుక్కున్న స్వదేశీ విద్య.. శతాబ్దాల పోరాటంతో దాస్య శృంఖలాలను తెంచుకుని స్వతంత్ర ప్రస్థానం ఆరంభించింది. ఎన్నో ఒడుదొడుకులను తట్టుకుని పురోగమిస్తోంది.

1947లో కేవలం 12% అక్షరాస్యత, 2.10 లక్షల పాఠశాలలతో ప్రారంభమైన ప్రయాణం.. నేడు 77.70% అక్షరాస్యులు, 15 లక్షలకుపైగా బడులతో విరాజిల్లుతోంది.

  • స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇరవై విశ్వవిద్యాలయాలు ఉండగా, ఇప్పుడవి 1,055కు పెరిగాయి.
  • నాటి ఇంజినీరింగ్‌ కళాశాలలు కేవలం 33… ఇప్పుడవి ఏకంగా 3,010.
  • దేశంలోని ప్రస్తుత విద్యార్థుల సంఖ్య 44.50 కోట్లు.ఇది రష్యా, పాకిస్థాన్‌, బ్రిటన్‌ల మొత్తం జనాభాతో సమానం.
  • 1947 కేంద్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి చేసిన ఖర్చు రూ.1.38 కోట్లు. అదే 2022లో రూ.1.04 లక్షల కోట్లు.
  • అమెరికా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా (12.50 కోట్ల మంది) ఆంగ్లం మాట్లాడుతున్నదీ భారతీయులే.

బ్రిటిష్‌ సంకెళ్లను తెంచుకున్న అనంతరం దేశ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చే దిశగా పలు కమిషన్ల సిఫార్సుల మేరకు వివిధ చట్టాలు, పథకాలు అమల్లోకి వచ్చాయి.

  • విశ్వవిద్యాలయ విద్యపై 1948లో రాధాకృష్ణన్‌ కమిషన్‌, మాధ్యమిక విద్యపై 1952లో మొదలియార్‌ కమిషన్‌, విద్యపై సమగ్ర పరిశీలనకు 1964లో కొఠారి కమిషన్‌ నిశిత మథనం సాగించాయి. వాటి సిఫారసుల ఆధారంగా రూపొందించిన జాతీయ విద్యావిధానం-1968, నూతన విద్యావిధానం-1986… ఇంకా పలు కమిటీల సూచనలు చదువుల ప్రస్థానానికి మార్గనిర్దేశం చేశాయి.
  • అందరికీ ప్రాథమిక విద్య అందించాలని, త్రిభాషా సూత్రాన్ని పాటించాలని, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలను వినియోగించాలని.. పారిశ్రామిక, వ్యవసాయ, వయోజన విద్యా కార్యక్రమాలు చేపట్టాలని కొఠారి కమిషన్‌ సూచించింది. అనంతర కాలంలో ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డు, డిపెప్‌, అనియత కేంద్రాలు, సర్వశిక్ష అభియాన్‌ (సమగ్ర శిక్ష అభియాన్‌) వంటి పథకాలు విద్యాభివృద్ధికి తోడ్పడ్డాయి.
  • 14 ఏళ్లలోపు బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య లక్ష్యంతో 2009లో విద్యాహక్కు చట్టం రూపుదాల్చింది. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నా, ఇంకా 3.20 కోట్ల మంది బడులకు దూరంగా ఉన్నారు.

భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం విద్యను అందించాల్సిన బాధ్యత రాష్ట్రాలది. దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం ఉండాలని 1968 నాటి జాతీయ విద్యావిధానం నిర్దేశించడంతో.. 1976లో రాజ్యాంగ సవరణ చేపట్టి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. జాతీయ చట్టాల స్ఫూర్తి దెబ్బతినకుండానే రాష్ట్రాలు తమ అవసరాల మేరకు వాటిని మార్పులతో అమలు చేస్తున్నాయి.

సార్వత్రిక విద్య కోసం దేశంలోనే తొలిసారిగా నాగార్జున సాగర్‌ కేంద్రంగా 1982లో ఏపీ ఓపెన్‌ యూనివర్సిటీ ఆవిర్భవించింది. దీన్ని తర్వాత హైదరాబాద్‌కు తరలించి.. డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టారు.

వైద్య విద్య నిమిత్తం విజయవాడ కేంద్రంగా 1986లో ‘ఆంధ్రప్రదేశ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌’ ఏర్పాటైంది. తర్వాత దీనిపేరు డా.ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంగా మారింది.

విద్యా రంగానికి, భావితరాలకు సరికొత్త దిశానిర్దేశం చేసేలా కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ విద్యా విధానం-2020’ని తెచ్చింది. 2030 నాటికి బడిఈడు పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించాలని సంకల్పించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ఏకీకృతం చేసి, 15 వేల అద్భుత విద్యా సంస్థలను తీసుకురావాలని భావించింది. పరిశోధనలకు దన్నుగా నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌, చదువుల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఫోరమ్‌లను నెలకొల్పాలని నిశ్చయించింది. 2040 నాటికి ప్రతి విశ్వవిద్యాలయాన్ని మల్టీ డిసిప్లినరీ విద్యా సంస్థగా మార్చాలని తలపోసింది. వచ్చే పాతికేళ్ల ప్రయాణంలో వీటన్నిటినీ సాకారం చేసుకుని పురోగమించాల్సి ఉంది.

19-24 మధ్య వయసు భారతీయుల్లో 5% మంది వృత్తి విద్యను అభ్యసిస్తుండగా.. అమెరికాలో 52%, జర్మనీలో 75%, దక్షిణ కొరియాలో 96% మంది శిక్షణ పొందుతున్నారు. 2021 గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో 132 దేశాల్లో భారత్‌ది 46వ స్థానం. దిగువ మధ్యస్థాయి ఆదాయమున్న దేశాల్లో మనది రెండో స్థానం.

2047లో శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్‌ అత్యుత్తమ విద్యా కేంద్రంగా భాసిల్లాలంటే.. నిపుణుల సూచనలివి..

ఇంటర్‌ విద్యార్థుల్లో 27% మందే ఉన్నతవిద్యలో అడుగుపెడుతున్నారు. దాన్ని 2035 నాటికి 50 శాతానికి పెంచాలన్న జాతీయ విద్యావిధానం లక్ష్యాన్నీ అధిగమించాలి.

విద్యకు జీడీపీలో 6% బడ్జెట్‌ కేటాయించాలి.

యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే సంస్కృతిని చదువుల్లో భాగం చేయాలి.

అన్ని స్థాయుల్లోనూ సమర్థులైన బోధకులను తయారు చేసుకోవాలి.

అత్యుత్తమ పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన పద్ధతులను పాటించాలి.

ఉన్నతవిద్యలో ఎదురవుతున్న సమస్యలను గమనంలో ఉంచుకుని.. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో అభ్యసన నైపుణ్యాలను గణనీయంగా మెరుగుపరచాలి.

శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్‌, గణిత (స్టెమ్‌) రంగాల్లో బోధనను బలోపేతం చేయాలి.

అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి, 100% అక్షరాస్యతను సాధించాలి.

ప్రతి విద్యార్థికి ఉద్యోగం, ఉపాధి లభించే దేశంగా తీర్చిదిద్దాలి.

వృత్తి విద్యలకు మరింత ప్రాధాన్యమివ్వాలి.

దేశంలో ‘పరిశోధన-అభివృద్ధి ఎక్కువగా పత్రసమర్పణకే పరిమితమవుతోంది. దీన్ని ఉత్పత్తి దశకు తీసుకెళ్లాలి. పారిశ్రామిక ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించి, ప్రైవేటు సంస్థలను భాగస్వాములను చేయాలి. కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఉచ్ఛతర్‌ ఆవిష్కార్‌ యోజన’ ఇందుకు మార్గనిర్దేశం చేయాలి. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ రీసెర్చ్‌’ తీరులో పరిశోధన సంస్కృతిని తీసుకురావాలి. “భారత విద్యావిహంగం ఎగిరేందుకు అంతా సిద్ధమైంది. దారి కనుగొని, రన్‌వే వేసుకోవడానికి 75 ఏళ్లు పట్టింది. సద్వినియోగం చేసుకుంటే వచ్చే పాతికేళ్లు మన దేశానికి స్వర్ణయుగమే. ఇప్పటికే నాలెడ్జి సొసైటీగా అవతరించాం. ఇక ముందున్నది… అన్ని రంగాల్లో సాంకేతికతను ఇముడ్చుకుంటూ డిజిటల్‌ దిశగా పయనించడమే. మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియాలతో సొంత ఉత్పత్తులను తీసుకురావాలి. తగినంతమంది వైద్య సిబ్బందిని తయారు చేసుకోవాలి.” – ఎస్‌ఎస్‌ మంథా, మాజీ ఛైర్మన్‌, ఏఐసీటీఈ .

క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకింగ్‌-2023 తొలి 200 విద్యాసంస్థల్లో బెంగళూరులోని ఐఐఎస్‌సీ(155వ ర్యాంకు), ఐఐటీ-బాంబే(172), ఐఐటీ-దిల్లీ(174) చోటు సాధించాయి. పటిష్ఠ ప్రణాళిక, సమర్థ ఆచరణ, అంతర్జాతీయ సహకారంతో విద్యా ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచుకుని.. తొలి వంద ర్యాంకుల్లో కనీసం పది సంస్థలనైనా నిలపాలి. ఇందుకు విశ్వవిద్యాలయాలు పరిశోధనలను, విద్యార్థుల పరస్పర మార్పిడిని పెంచుకోవాలని టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్‌ దక్షిణాసియా ప్రాంత సంచాలకుడు రితిన్‌ మల్హోత్రా పేర్కొన్నారు.

“జ్ఞానం, శాస్త్రపరిజ్ఞానంతోనే జీవితం ఆనందమయం అవుతుంది. విద్యతోనే సంస్కృతుల మధ్య వారధులను నిర్మించగలం. చారిత్రక పరిస్థితులను, ప్రతికూలతలను సమర్థంగా అధిగమించగల స్వేచ్ఛాయుత, సృజనాత్మక మనిషిని తయారుచేయడమే విద్య అంతిమ లక్ష్యం కావాలి.”- డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ . .

Read more RELATED
Recommended to you

Exit mobile version