కరోనాను నియంత్రించడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని దేశంలోని పలువురు వైద్య నిపుణులు ఆరోపించారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ (ఐపీహెచ్‌ఏ), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ (ఐఏపీఎస్‌ఎం), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడెమియాలజిస్ట్స్ (ఐఏఈ)లతోపాటు ఎయిమ్స్, బనారస్ హిందూ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలకు చెందిన వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు ఈ మేరకు మోదీకి ఓ నివేదిక పంపారు.
లాక్‌డౌన్ ఆరంభంలోనే వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఎక్కడి వారిని అక్కడికి పంపించివేస్తే సమస్య ఉండేది కాదని, ఇప్పుడు కరోనా కేసులు అంతగా నమోదు అయ్యేవి కావని సదరు నిపుణులు పేర్కొన్నారు. వైద్య రంగానికి చెందిన నిపుణులు, ఎపిడెమియాలజిస్టులను సంప్రదించకుండానే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారని, కేంద్రం కరోనాను అదుపు చేయడంలో విఫలమైందని అన్నారు.
కేంద్రం చేసిన తప్పులకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. మార్చి 25న లాక్‌డౌన్ ఆరంభం కావడానికి ముందు దేశంలో 606 కేసులు మాత్రమే ఉన్నాయని.. కానీ ఇప్పుడు 2 లక్షలకు చేరువవుతున్నాయని.. అది అత్యంత తీవ్ర పరిణామమని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవాలని అన్నారు.