ఈ దఫా టీడీపీ నిర్వహించిన మహానాడులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏటా కచ్చితంగా మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడును ఈ దఫా కేవలం రెండు రోజులకే పరిమితం చేశారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా.. కార్యక్రమాన్ని జూమ్ యాప్‌లో నిర్వహించారు. ఇక కీలకమైన నాయకులు ఇంటికే పరిమితమయ్యారు. మరికొందరు అసలు పాల్గొననేలేదు. అదే సమయంలో ఎప్పుడు చేసే తీర్మానాలనే ఈ దఫా కూడా చేశారని టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి కేవలం బాలయ్యే కాకుండా మిగిలిన హీరోలు తారక్, కల్యాణ్‌రామ్‌లు హాజరు కాలేదు.
వాస్తవానికి మహానాడుకు నందమూరి ఫ్యామిలీ నుంచి కనీసం పది మంది కచ్చితంగా పిలవకపోయినా వచ్చేవారు. అలాంటిది ఈ దఫా మాత్రం హాజరు కాలేదు. ఇవన్నీ మైనస్‌లుగానే టీడీపీలో ప్రచారం అవుతున్నాయి. వీటన్నింటికీ తోడు .. ఎస్సీ వర్గానికి చెందిన నాయకుల సంఖ్య కూడా ఈ దఫా మహానాడులో కనిపించలేదు. ఒకరిద్దరు మాజీ మంత్రులు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వంటివారు జూమ్‌లో పాల్గొన్నప్పటికీ.. పార్టీ సీనియర్లు అయిన ప్రతిభాభారతి వంటివారి అడ్రస్ కనిపించలేదు.
అదే సమయంలో గత ఏడాది పార్టీలో ఉన్న కారెం శివాజీ, జూపూడి ప్రభాకర్ వంటి వారు తమ గళం వినిపించారు. ఈ దఫా వారంతా కూడా జగన్ పక్కన చేరుకున్నారు. అదేసమయంలో శమంతకమణి వంటి సీమ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా జగన్ దగ్గరే ఉన్నారు. ఇలా మొత్తానికి దళిత నాయకులు పెద్దగా టీడీపీ మహానాడులో కనిపించలేదు. ఇవన్నీ ఒకటైతే.. మరోపక్క, చంద్రబాబు కూడా దళితుల అభ్యుదయానికి సంబంధించి మహానాడులో ఎలాంటి తీర్మానాలూ చేయకపోవడం గమనార్హం.
బీసీలకు సంబంధించి దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించిన చంద్రబాబు.. దళిత వర్గాలకు సంబంధించిన ప్రధాన సమస్యలను ప్రస్తావించలేదు. ఎస్సీ వర్గ విభజన వంటి కీలక అంశంలో ఆయన వ్యూహం ఇప్పటికీ వెల్లడించలేదు. గతంలో మహానాడులో దీనిపై ప్రకటన చేసిన బాబు.. ఇప్పుడు రెండేళ్ల తర్వాత నిర్వహించినా.. బలమైన దళిత గళం వినిపించడంలో వెనుకడుగు వేశారని అంటున్నారు.