కరోనా మహమ్మారి విషయంలో ఆ దేశంలో ఇలా జరిగింది.. ఈ దేశంలో అలా జరిగింది.. సో, మనం జాగ్ర త్తగా ఉండాలి! ఇల్లు దాటకూడదు. లాక్‌డౌన్‌ను పూర్తిగా పాటించాలి!! ఇదీ ఇప్పటి వరకు దేశ ప్రజలకు, మన రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వాలు, మీడియా చెప్పిన పాఠాలు. దీంతో ఆ.. అక్కడెక్కడో అలా జరిగితే.. మనకెందుకు? మనది గట్టి దేశం.. నియమ నిబంధనలు పాటించే దేశం.. అన్ని జంతువులను తినే దేశం కాదుకదా? ఆహారనియమాలు, వ్యాయామం చేస్తాం.. కదా? ఆదే శాల్లో ఏదో జరిగిందని మనం ఎందుకు చేతులు, మూతులు ముడుచుకుని కూర్చోవాలి? అని ప్రశ్నించే పెదరాయుళ్లకు.. ఇప్పుడు చక్కని పాఠం.. మన గుంటూరే చెబుతోంది!!
మరి గుంటూరు చెబుతున్నపాఠం ఏంటో చూద్దామా? ఇక్కడి వారిలో కరోనా వైరస్ లక్షణాలు లేవు. ఆరోగ్యవంతంగా కనిపిస్తున్నారు. వైద్యులు చెబుతున్నట్లుగా వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అయినా జిల్లాలో వంద మందికి కరోనా సోకింది. ఆర్‌టీ పీసీఆర్ టెస్టుల్లోనూ వైరస్ నిర్ధారణ జరిగింది. కరోనా పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చిన ఈ వంద మందిని చూస్తే అటు డాక్టర్లు, ఇటు అధికారులు ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 118 మందికి కరోనా పాజిటివ్ రిపోర్టులు రాగా వారిలో వంద మందికి ఎలాంటి జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడం కష్టం కావడం వంటి కరోనా లక్షణాలేవి కనిపించ లేదు. దీంతో వారంతా తమకు వ్యాధి సోకలేదేమోనన్న భ్రమలో ఉంటున్నారు.
103 డిగ్రీల వరకు జ్వరం, ఊపిరితిత్తులు పగిలిపోతాయనే స్థాయిలో పొడిదగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడం వంటి లక్షణాలు కరోనా వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తాయని ఇప్పటివరకు డబ్ల్యూహెచ్‌వో కూడా చెబు తోంది. అయితే జిల్లాలోని కరోనా వ్యాధిగ్రస్తుల్లో సింహభాగం ఆ లక్షణాలు కనిపించడం లేదు. విదేశాల నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వారిని గుర్తించి వారి ఇళ్లలోనే క్వారంటైన్ చేశారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి తిరిగొచ్చిన తొమ్మిది మంది వల్ల ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ పెరిగిపోయాయి. కొన్ని కేసుల్లో అయితే వారికి వైరస్ ఎలా సోకిందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అధికారులు తీగ లాగి కాంటాక్ట్స్‌ని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
అక్కడ పరీక్షలు నిర్వహిస్తే తప్ప వారికి వైరస్ సోకిందని తెలియడం లేదు. అయితే, కరోనా లక్షణాలు కనిపించని కారణంగా చాలామంది క్వారంటైన్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకు నేందుకు ముందుకు రావడం లేదు. దీని వలన వారి కాంటాక్ట్స్ కూడా పెరిగిపోతున్నాయి. అంటే.. మనకు మనం జాగ్రత్తలు పాటించకుండా.. ఏం జరుగుతుందిలే..! అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ప్రతి జిల్లాకు కూడా గుంటూరుకు పట్టినగతే పడుతుందనడంలో సందేహం లేదు. ఈ విషయాన్ని తెలుసుకుని గుంటూరు పాఠం నేర్చుకుని బుద్దిగా ఇంట్లోనే ఉండాలని వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. మరి మనం ఏం చేద్దాం?! ఒక్కసారి నిర్ణయించుకోండి!!