రాష్ట్రంలో నాలుగో సింహం నలిగిపోతోంది! దురదృష్టం ఏంటంటే.. ప్రజలు అందరినీ పట్టించుకుంటారు.. కానీ, పోలీసుల విషయా నికి వచ్చే సరికి మాత్రం దూరం పెడతారు. వారికి ఎదురయ్యే సమస్యలను మాత్రం పట్టించుకోరు. ప్రజలకు ఎదురయ్యే సమస్య లను పరిష్కరించేందుకు పోలీసులు 24/7 అందుబాటులో ఉంటే.. వారి సమస్యలను వినేందుకు ప్రజలు కానీ, నాయకులు కానీ దీనిలో పావు వంతు కూడా కేటాయించకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోక(వక్క) మాదిరిగా తయారైందనేది నిర్వివాదాంశం. గతంలో టీడీపీ హాయంలోను, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనూ పోలీసులు తీవ్రస్థా యిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు మూకుమ్మడిగా పోలీసులనే టార్గెట్ చేసుకున్నారు.
ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని పార్టీ అధినేత హోదాలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ బాహాటంగానే విమర్శించారు. విశా ఖ విమానాశ్రయంలో తనపై జరిగిన కోడికత్తి కేసుపై ఫిర్యాదును ఆయన హైదరాబాద్‌లో పోలీసులకు చెప్పడం కూడా అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఆ తర్వాత కూడా ఆయన అనేక సార్లు పోలీసులపై విమర్శలు చేశారు. ఇక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా వైసీపీ బాటలోనే ప్రయాణిస్తోంది. తమకు ఏపీ పోలీసులపై నమ్మకం పోయిందంటూ.. సాక్షాత్తూ మాజీ సీఎం, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు ప్రకటించడం ఒక్కసారిగా కలకలం రేపింది.
దీంతో ఏపీ పోలీసు వ్యవస్థపై అనేక చర్చలు నడుస్తున్నాయి. నిజంగానే ఏపీ పోలీసులపై ప్రతిపక్షంలో ఉన్నవారికి నమ్మకం ఉండడం లేకపోవడం ఒకింత ఆశ్చర్యం కల్పించే విషయమే..! గతంలో వైసీపీ,ఇప్పుడు టీడీపీ దెబ్బతో నాలుగో సింహంగా భావించే పోలీసులు నలిగిపోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ రెండు సార్లు హైకోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం, పోలీసుల చర్యలపై వివరణ ఇవ్వాల్సి రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఈ మొత్తం ఎపిసోడ్‌లో తప్పు ఎవరిది? అనేది కూడా ప్రధానంగా పరిశీలించాల్సిన అవసరం. అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుంగు మిత్రులుగా మారుతున్న పరిస్థితే.. పోలీసులకు శాపంగా పరిణమించిందన్న సీనియర్ పోలీసుల వ్యాఖ్యలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటీవల ఇంటిలిజెన్స్ డీజీ గా ఉండి జగన్ ప్రభుత్వంతో సస్పెండ్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు, జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర డీజీపీగా ఉన్న ఆర్ పీ ఠాకూర్ ఉదంతాలు కూడా ప్రస్థావనార్హం. అధికారంలో ఉన్నవారు శాశ్వతం అనుకునో.. లేదా తమకు పనులు అవుతాయని భావించడమో కారణంగానే పోలీసులు చులకన అవుతున్నారనేది వాస్తవం. మరి ఈ విషయంలో వారు వ్యవహరించబోయే విధానమే సింహాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తుందనడంలో సందేహం లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.