గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాదించిన ఎన్నారై మహిళ విడదల రజనీ వైసీపీ గుర్తుపై గెలిచి తన సత్తా చాటుకున్నారు. అయితే, ఎన్నికలకు ముందు, తర్వాత ఆమె వ్యవహార శైలి ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ముందు అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. తల్లో నాలుకలా వ్యవహరించి, అన్నీ తానై చూసిన ఆమె.. అనూహ్యంగా గెలుపు గుర్రం ఎక్కాక.. ఒంటెత్తు పోకడలతో వెళుతున్నారన్న వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఎవరైనా ప్రత్యర్థులపై ప్రతాపం చూపిస్తారు. కానీ, విడదల మాత్రం సొంత పార్టీ నాయకులు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలపైనే ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, వారిని లెక్కచేయకపోవడం, నియోజకవర్గంలోనూ వివాదాలకు కేంద్రంగా మారినట్టు సొంత పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.
విషయంలోకి వెళ్తే.. తనకు టికెట్ ఇచ్చేందుకు, తను గెలిచేందుకు దోహద పడిన వైసీపీ సీనియర్ నాయకుడు, నియోజకవర్గంలో కీలకమైన నాయకుడు మర్రి రాజశేఖర్‌తో ఎన్నికలకు ముందు బాగానే ఉన్న రజనీ.. ఎన్నికల తర్వాత ఆయనను దూరం పెట్టేశారు. అసలు మర్రి మాటే ఎత్తడం లేదు. పైగా ఆయన వర్గాన్ని కూడా దూరం పెట్టడం వివాదంగా మారింది. ఇక, తనకు సంబంధంలేని తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి తోనూ విడదల రగడకు దిగుతున్నారు. వీరిద్దరి మధ్య కూడా సఖ్యత లేదు. ఇక నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుతోనూ జగడానికి దిగుతున్నారు. లావుతో కలిసేందుకు ఆమె ఇష్టపడడం లేదని ఎంపీ వర్గం ఆరోపిస్తోంది.
ఇక, స్థానికంగా ఓ స్కూల్ హెడ్మాస్టర్ విషయంలోనూ వివాదానికి దిగి ఏకంగా హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతొంది. అదే సమయంలో నియోజకవర్గాన్ని విడిచి పెట్టి గుంటూరులో మకాం ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆమె గుంటూరుకు మాకం మార్చేశారు. సొంత వ్యవహారాల్లో బిజీగా గడుపుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నా.. వినిపించుకోనట్టే వ్యవహరిస్తున్నారట. ఆమె గెలుపుకోసం కృషి చేసిన ఒక్కొక్కరిని తెలివిగా పక్కన పెట్టుకుంటూ ఓ కోటరీని ఏర్పరుచుకున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు.
తాజాగా హెడ్మాస్టర్ సస్పెండ్ సంఘటనతో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదో తెలియని ఆందోళన నెలకొందని తెలుస్తోంది. పెచ్చరిల్లిన రేషన్ మాఫియా, కేబుల్ మాఫియా. సిఫారసులు లేకుండా చిన్న చిన్న పనులు కూడా చేయకపోవడం వంటివి ఇప్పుడు రజనీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని టాక్..? బీసీ బీసీ అని చెప్పుకుంటూ నియోజకవర్గ పరిధిలో బీసీలకు జరిగిన అన్యాయాలలో కనీస చొరవచూపలేక పోతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇక తన గెలుపుకోసం కష్టపడ్డవారేనని కూడా ఆమెకు స్పష్టంగా తెలిసినా ఏదయినా గట్టిగా అడిగితే వారిమీద మర్రి వర్గం అని ముద్రవేసి వారిని దూరం పెడుతున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా విడదల రజనీ కాస్తా.. వివాదాల రజనీ అవుతున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ ఆధిపత్య రాజకీయాన్ని జగన్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి అంటున్నారు సీనియర్లు.