శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉండనే ఉంటాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలు సృష్టించిన అనేక దరిద్రాలను అనంతకోటి ఉపాయాలతో ఎదుర్కొనబోతోంది. కిందపడ్డా పైచేయేనని చెప్పేప్రతిపక్షాలకు ముక్కు పిండి మరీ ప్రభు త్వం తన వాదనను నిరూపించుకునేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు ఏపీ ప్రజలే మరోసా రి కొండంత అండగా నిలుస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియానికి బదులుగా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధాన కారణం.. పేద వర్గాలు ఇంగ్లీష్ మీడియం చదువులకు దూరం కావడం వల్ల వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అదేసమయంలో వారు ఉపాధి కోల్పోయి.. తరతరాలుగా అణగారినవర్గాలుగానే ఉండిపోతున్నారు.
అలాగని ప్రైవేటు స్కూళ్లకు పంపి చదివించే స్థోమత కూడా పేద వర్గాలు లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారికి ఉచితంగా విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రతి విష యాన్నీ రాజకీయ కోణంతో చూసే ప్రతిపక్షాలు దీనిని జీర్ణించుకోలేక పోయాయి. ఠాఠ్ తెలుగు భాషను కూనీచేస్తున్నారని విరుచు కుపడ్డాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర హైకోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి. ఈ క్రమంలో విచారణ చేసిన హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. తెలుగు మీడియాన్ని తీసేయడానికి వీల్లేదని చెప్పింది. అదేసమయంలో విద్యార్థుల ఇష్టం ప్రకారమే మీడియం ఉండా లని తెలిపింది. దీంతో ప్రతిపక్షాలు పండగ చేసుకున్నాయి.
కానీ, హైకోర్టు శాసనంలోనే ఉన్న వెసులుబాటును ప్రభుత్వం వినియోగించుకునేందుకు రెడీ అయింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉండడంతో ఆదిశగానే ఇప్పుడు జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని, ప్రపంచంతో పోటీపడాలని ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశ పెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం అటు న్యాయ పరంగాను, ఇటు ప్రజల ఆలోచన పరంగానూ కూడా వారి అబిప్రాయాలు తెలుసుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. ఇదే జరిగితే.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఊహించనట్టు కాకుండా అటు హైకోర్టు తీర్పు మేరకు విద్యార్థుల ఇష్టం మేరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టేందుకు అడుగులు వేయనుంది. ఇది వర్కవుట్ అయితే, ఇక, జగన్ ప్రభుత్వం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.