అమెరికా పాఠశాలల్లో మన భారతీయ భాషలో పాఠాలు బోధించడం కాస్త డిఫరెంట్ కదా. నిజమండీ బాబు. అగ్రరాజ్యంలోని సిలికాన్ వ్యాలీలో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ పాఠాలు బోధిస్తున్నారట. ఈ రెండు బడుల్లోని పాఠ్య ప్రణాళికలో హిందీని ప్రపంచ భాషగా చేర్చారు. కాలిఫోర్నియా రాష్ట్ర విద్యా సంస్థల్లో ఈ భాషను ప్రవేశపెట్టడం ఇది తొలిసారి అని అక్కడి అధికారులు చెబుతున్నారు.
దీన్ని భారత అమెరికన్లు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. వీరు తమ పిల్లల కోసం పాఠశాలల్లో హిందీని ప్రవేశపెట్టాలని చాలా కాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. భారత్ను విడిచి వచ్చినా తమ జీవితంలో స్వదేశం ఎప్పుడూ భాగమని భావించే తమ చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరినట్టైందని ఇండో అమెరికన్లు సంతోషం వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలో భారత అమెరికన్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్రెమాంట్ నగరం ఒకటి. అక్కడి హోర్నర్ మిడిల్ స్కూల్, ఇర్వింగ్‌టన్ హైస్కూల్‌లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యప్రణాళికలో ప్రయోగాత్మకంగా హిందీని ప్రవేశ పెట్టాలని అక్కడి బోర్డు ఈ నెల 17వ తేదీన నిర్ణయించింది.