ఇజ్రాయెల్ – హమాస్ ల మధ్య భీకర పోరు రోజురోజుకు తీవ్ర ఉద్ధృతమవుతోంది. ఇక ఇటీవల హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇలా వరుస దాడుల వల్ల పాలస్తీనా పౌరులు ప్రాణాలను కోల్పోతున్నారు.
శనివారం రోజున గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన రెండు వేర్వేరు వైమానిక దాడుల్లో 36 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలోని పురాతనమైన ఆల్-షాతి శిబిరంపై జరిపిన దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ఆల్ తుఫా జిల్లాలో మరణించారు. ఆల్షాతిపై ఇజ్రాయెల్ దళాలు దాడి జరపడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఈ శిబిరంపై అనేక సార్లు దాడులు జరిపాయి. గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిథిలాల కింద మృతుల కోసం సహాయక బృందాలు వెతుకుతున్నాయి.