‘ఎ ప్రామిస్ట్ ల్యాండ్’ : దేశాధినేతలపై తన అభిప్రాయాలు: ఒబామా

-

బరాక్ ఒబామా.. అగ్రరాజ్యంలో తొలి నల్లజాతి అధ్యక్షుడిగా.. తనకు ఎదురైన అనుభవాన్నింటిని కలగలిపి ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ పుస్తకాన్ని రాశారు. కొంచెం హాస్యం, కాసింత క్లప్తత మరింత అధ్యయనం కలబోసి ఆయన ఎవరి గురించి ఏమన్నారంటే?

obama

రాహుల్‌ గాంధీని బరాక్‌ ఒబామా అధైర్యంతో కూడిన నాయకుడిగా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో వర్ణించారు. వివరంగా చెప్పాలంటే ‘‘రాహుల్‌గాంధీ ఓ విద్యార్థి అనుకుంటే… చదవాల్సిందంతా చదివి టీచర్‌ దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న వాడిలా కనిపిస్తాడు. కానీ, చదివిన విషయంపై పట్టు సాధించాలన్న అభిరుచి, మోహం రెండింటిలో ఏదో ఒకటి లోపించినట్లు అనిపిస్తుంది.’’అని వ్యాఖ్యానించారు.

‘‘చార్లీ క్రైస్ట్, రామ్‌ ఎమ్మాన్యుల్‌ వంటి మగవాళ్ల అందం గురించి అందరూ చెబుతుంటారు. మహిళల సౌందర్యం గురించి మాత్రం వాళ్లూ వీళ్లు చెప్పేది తక్కువే. ఒకట్రెండు సందర్భాలను మినహాయిస్తే సోనియాగాంధీ విషయంలోనూ ఇదే జరిగింది.’’అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి చేసిన వ్యాఖ్య ఇది. పదేళ్లపాటు దేశ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్‌ సింగ్‌ను బరాక్‌ ఒబామా అమెరికా రక్షణ శాఖ మాజీ మంత్రి రాబర్ట్‌ గేట్స్‌తో పోల్చారు. ఇద్దరూ దయతో కూడిన నిష్పాక్షికత కలిగిన వారని, వారి చిత్తశుద్ధి, సమగ్రతలూ ఎన్నదగ్గ లక్షణాలని కొనియాడారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తనకు కండల వీరుడిని గుర్తుకు తెస్తాడని ఆయన శరీరాకృతి అద్భుతమని ఒబామా వ్యాఖ్యానించారు. షికాగో రాజకీయాల్లో తెలివైన రాజకీయ నేతల మాదిరిగా పుతిన్‌ వ్యవహారం ఉంటుందని ఒబామా వర్ణించారు.అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ గురించి మాజీ అధ్యక్షుడు, సహచర డెమోక్రాట్‌ అయిన బరాక్‌ ఒబామా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ మంచి మనిషి, నిజాయితీ కలవాడు అంటూనే.. కొన్నిసార్లు తనకు కావాల్సింది దక్కలేదు అనుకుంటే ఇబ్బందికరంగా మారగలడని అన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ఓ నల్లజాతీయుడు వైట్‌హౌస్‌లో అడుగుపెట్టడం లక్షల మంది శ్వేతజాతీయులకు భీతి కలిగించిందని, వీళ్లంతా రిపబ్లికన్‌ పార్టీలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న దుష్టశక్తులని ఒబామా తన పుస్తకంలో తెలిపారు. అధ్యక్షుడిగా ఉండటంతో ఆ ఒత్తిడి వల్ల భార్య మిషెల్ ఒబామాకు నిస్పృహ కలిగించేదని ఒబామా తన పుస్తకంలో రాశారు. వైట్ హౌస్లో నాలుగు గోడల మధ్య బంధీ అయిపోయామన్న భావన తనలో కనిపించేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తనకు ఒకసారి బ్లాక్‌బెర్రీ ఫోన్‌ ఇచ్చారని, కానీ అందులో మైక్రోఫోన్, హెడ్‌ఫోన్‌ జాక్స్‌ రెండింటిని తొలగించిన తరువాతే తనకు ఇచ్చారని ఒబామా ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో తెలిపారు. మైక్రోఫోన్, హెడ్‌ఫోన్‌ జాక్స్‌ రెండూ లేకపోవడంతో పసిపిల్లలకు ఇచ్చే డమ్మీఫోన్‌ మాదిరిగా ఉండేదని సరదాగా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version