భారతీయులకు గుడ్ న్యూస్. హెచ్-1బీ వీసా కలిగిన వారి జీవిత భాగస్వాములు, వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా జారీ చేసే హెచ్-4 వీసాలకు సంబంధించి కీలక బిల్లుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. హెచ్-4 వీసా కలిగిన వారికి ఊరటనిచ్చే కీలక బిల్లును త్వరలో సెనెట్ ఆమోదించనున్నట్లు తెలిసింది. ఈ బిల్లుతో సుమారు లక్ష మందికి లబ్ధి చేకూరనున్నట్లు సమాచారం.
అమెరికన్ సెనెట్‌లో రిపబ్లికన్‌లు, డెమోక్రాట్‌ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల్లో జాతీయ భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్-4 వీసాలు జారీ చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న నిబంధనలు మార్చి హెచ్-4 వీసాదారులకు ఆటోమేటిక్ వర్క్ ఆథరైజేషన్ కల్పించేలా కొత్త బిల్లును రూపొందించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఈ బిల్లుకు ఆమోదం తెలపనున్నట్లు వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది. చట్టబద్ధంగా వలసలకు బిల్లు అవకాశం కల్పిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.