ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా సంచలన నిర్ణయం తీసుకుంది. తాము అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఈ టీకా తీసుకున్న వారిలో అరుదుగా దుష్ప్రభావాలను కలిగిస్తుందని ఇటీవలే యూకే కోర్టుకు ఆస్ట్రాజెనికా తెలిపిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వాణిజ్య కారణాల వల్ల ఈ టీకాను మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా సంస్థ వెల్లడించింది.
కొత్త వేరియంట్లతో పోరాడే అనేక వ్యాక్సిన్లు మార్కెట్లో లభిస్తున్నందున మా టీకాకు గిరాకీ తగ్గింది. ఈ నేపథ్యంలో మేము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఇకపై తయారీ చేయం. సరఫరా కూడా చేయం అని ఆస్ట్రాజెనెకా కంపెనీ వెల్లడించింది. యూరోపియన్ యూనియన్‌లో టీకా ఉపసంహరణకు మార్చి 5వ తేదీన దరఖాస్తు చేయగా అది మే 7న అమల్లోకి వచ్చింది. “వాక్స్‌జెవ్రియా” పేరుతో తయారు చేసిన టీకాను కొద్ది నెలల్లో యూకే, ఇతర దేశాలలోనూ ఉపసంహరించేందుకు దరఖాస్తులు సమర్పిస్తామని ఆ సంస్థ తెలిపింది.