బ్రెజిల్ దేశాన్ని వానలు వణికిస్తున్నాయి. ప్రపంచమంతా సూర్య ప్రతాపానికి ఉక్కపోతతో అల్లాడుతుంటే.. బ్రెజిల్లో మాత్రం వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదలు ముంచెత్తడంతో పలు నగరాలు నీటమునిగాయి. “రియో గ్రాండే దోసుల్ ” రాష్ట్రంలో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 75 కు పెరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. 100 మందికి పైగా గల్లంతయ్యారని వెల్లడించారు.
రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్ సహాయక చర్యల్లో బిజీగా ఉంది. పలు చోట్ల హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. రికార్డు స్థాయి వరద కారణంగా అనేక నగరాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందనీ వెల్లడించారు. వరదల వల్ల 88 వేల మంది ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని ఆ దేశ పౌర రక్షణ విభాగం వెల్లడించింది. రియో గ్రాండే దోసుల్ చరిత్రలో ఇదే అత్యంత ప్రమాదకర వరదలని పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్రెజిల్ రాష్ట్రపతి లూయిజ్ ఇనాసియో మరోసారి ఏరియల్ సర్వే నిర్వహించి ప్రజలకు భరోసా కల్పించారు.