గాలిలో రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్న ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. అక్కడి పర్యాటక ప్రదేశమైన ఓ బీచ్ సమీపంలో ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా.. మరొకటి గాలిలోకి ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు క్వీన్స్‌లాండ్ అధికారులు వెల్లడించారు.
ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్‌లోని పర్యాటక ప్రదేశమైన గోల్డ్‌కోస్ట్‌లో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సీ వరల్డ్ థీమ్ పార్కు బీచ్‌లో ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతోన్న క్రమంలోనే మరొకటి టేకాఫ్ అవుతోంది. ఆ సమయంలో రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ఒక హెలికాప్టర్ పూర్తిగా నుజ్జునుజ్జు కాగా.. మరొకటి మాత్రం పాక్షికంగా దెబ్బతింది. రెండో హెలికాప్టర్ మాత్రం బీచ్‌లో సురక్షితంగా దిగినట్లు క్వీన్స్‌లాండ్ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.