కిర్గిస్థాన్ దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని నగరం బిషెక్‌లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగింది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు పాకిస్థాన్ విద్యార్థులు మరణించారు. చాలా మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయ విద్యార్థులు ఎవరు బయటకు రావొద్దని సూచించింది.
ఈ మేరకు అక్కడి మన దేశ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ‘‘మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి’’ అంటూ 24 గంటలు అందుబాటులో ఉండే ఒక ఫోన్ నంబర్ (0555710041)ను షేర్ చేసింది. కిర్గిస్థాన్, ఈజిప్ట్‌కు చెందిన విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారి తీసిందని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.