న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రసంగించేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల న్యూయార్క్‌కు వచ్చారు. రైసీ ఇంటర్వ్యూ తీసుకోడానికి అమన్పూర్ అనే ఇంటర్నేషనల్ యాంకర్ కొన్ని వారాల ముందే ప్లాన్ చేశారు. అన్నీ రెడీ చేసుకున్నారు. మరో 40 నిమిషాల్లో రైసీ రావాల్సి ఉండగా.. ఆయన రాకుండా ఆయన సహాయకుడు ప్రత్యక్షమయ్యారు.
అమన్పూర్ ను హిజాబ్ ధరించాలని అధ్యక్షుడు కోరారని ఆయన సహాయకుడు చెప్పారు. తాము న్యూయార్క్‌లో ఉంటున్నామంటూ ఆ మాటను ఆమె తిరస్కరించారు. ససేమిరా అన్న సహాయకుడు అమన్పూర్ హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ జరుగుతుందని తేల్చి చెప్పారు. అమన్పూర్ ఇంటర్వ్యూ రద్దు చేసుకున్నారు.
“ఓ పక్క ఇరాన్‌లో హిజాబ్ గురించే జరుగుతున్న తీవ్ర ఆందోళనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడటానికి ఇది చాలా కీలక సమయం” అంటూ ఆమె విచారం వ్యక్తం చేశారు. యాంకర్ హిజాబ్ ధరించలేదన్న కారణంతో ఇరాన్ అధ్యక్షుడు ఇంటర్వ్యూను తిరస్కరించడం.. అది కూడా యూఎన్ సమావేశాలు జరగుతున్న తరుణంలో రైసీ చర్య ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే హిజాబ్ ధరించాలంటూ.. తమ స్వేచ్ఛా హక్కులు కాలరాస్తున్నారని ఇరాన్ సర్కార్ పై ఆ దేశ మహిళలు ఉద్ధృతంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.