గాజాపై గత కొన్ని రోజులుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆదివారం రోజున కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ గాజాలోని రఫాలో పగటిపూట యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేందుకు వీలుగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఏడు గంటలవరకు కాల్పులకు విరామం ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ధ్రువీకరించింది.
రఫా ప్రాంతంలోని 12 కిలోమీటర్ల మేర రహదారి వెంబడి ఈ వ్యూహాత్మక విరామం కొనసాగనున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. గత కొన్ని వారాలుగా మానవతా సాయం అందక, అల్లాడుతున్న పాలస్తీనియన్లను ఊరట లభించనుంది. తదుపరి నోటీసు ఇచ్చేవరకు ఈ విరామం కొనసాగుతుందని ఐడీఎఫ్ వెల్లడించింది. కెరోమ్ షాలోమ్ క్రాసింగ్ దగ్గర మానవతా సాయంతో వేచి ఉన్న ట్రక్కులు సురక్షితంగా సలాహ్-అల్-దిన్ రహదారి నుంచి ప్రయాణించగలవు. దీంతో రఫా ప్రాంతానికే కాకుండా.. ఖాన్ యూనిస్.. ఉత్తర గాజాలోని ప్రాంతాలకు మానవతాసాయం అందే అవకాశం ఉంటుంది.