బందీలను విడుదల చేయాలంటే ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ఆపాల్సిందేనంటూ హమాస్ షరతు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బందీలను విడిపించడానికి కాల్పుల విరమణ పాటించాల్సిందేనంటూ ఇజ్రాయెల్‌పై ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు స్థానిక ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇజ్రాయెల్ సైన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం ఇదేం పట్టనట్లుగా వాటిని కొట్టిపారేస్తున్నారు. యుద్ధం ద్వారానే హమాస్ నుంచి విముక్తి లభిస్తుందని తెగేసి చెబుతున్నారు.
కాల్పుల విరమణ కోసం హమాస్‌తో చర్చలు తిరిగి ప్రారంభించాలని ఇజ్రాయెల్‌లో స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. రోడ్లపైకి వచ్చి బందీల విడుదలకు చర్యలు తీసుకోవాలని డిమాండ చేస్తూ జాతీయ రహదారులను దిగ్బంధిస్తున్నారు. టెల్ అవీవ్‌లోని రక్షణశాఖ కార్యాలయం ఎదుట వందల మంది ఇజ్రాయెలీలు టెంట్లు వేసి .. హమాస్‌తో చర్చలు మొదలయ్యే వరకూ అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ వచ్చిన ఫ్రాన్స్ విదేశాంగశాఖ మంత్రి కాథరీన్ కలోనా అత్యవసర సంధికి అంగీకరించాలని నెతన్యాహుకు సూచించారు. బందీల విడుదలకు మార్గం సుగమం చేయాలని కోరారు. అయినా నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.