హమాస్‌తో జరుగుతోన్న పోరులో తాజాగా ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన ఆర్‌పీజీ లాంచర్ వల్ల 21 మంది సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది.
సెంట్రల్ గాజాలో రెండు భవనాలను కూల్చేందుకు సోమవారం రోజున సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతుండగా సమీపంలోని ట్యాంక్‌పైకి హమాస్ గ్రనేడ్‌ను ప్రయోగించగా దాని ధాటికి మందుగుండు పేలిపోయింది. ఆ భవనాలు సైనికులపై కుప్పకూలడంతో 21 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుత దుర్ఘటనతో యుద్ధం నిలిపివేయాలంటూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి పెరగనున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంపై మరోసారి అమెరికా స్పందించింది. రెండు వర్గాల మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.