న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఈ ఏడాది జనవరిలో ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల నుంచి కూడా పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె న్యూజిలాండ్ పార్లమెంట్‌లో వీడ్కోలు సభలో ప్రసంగించారు. మహిళలకు నాయకత్వానికి, రాజకీయాలకు మాతృత్వం అడ్డు కాకూడదని అన్నారు.
‘‘మంచి తల్లిగా ఉండేందుకే నేను రాజకీయాలను నుంచి వైదొలుగుతున్నా. మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు, నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు మాతృత్వం అడ్డంకి కాకూడదు. లేబర్ పార్టీ నాయకురాలిగా ఎన్నికైనప్పుడు నేను నా మాతృత్వాన్ని కోల్పోవాలని అనుకోలేదు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత తల్లిని కాబోతున్నానని తెలిసి ఎంతో సంతోషించా. రాజకీయ నాయకులు కూడా మనుషులే. వారి శక్తి సామర్థ్యాల మేరకు ప్రజలకు సేవ చేస్తారు. తర్వాత వారి కోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. దేశానికి నాయకత్వం వహించడం ఎంతో ఉన్నతమైంది. ప్రస్తుతం వాతావరణ మార్పు మన ముందు ఉన్న పెద్ద సంక్షోభం. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ సందర్భంగా అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. పర్యావరణ పరిక్షణ విషయంలో మాత్రం రాజకీయాలు చేయకండి. రాజకీయాలను దానికి దూరంగా ఉంచండి’’ అని జెసిండా తన ప్రసంగంలో పేర్కొన్నారు.