అమెరికా అధ్యక్ష రేసులోకి భారత సంతతి మహిళ కమలా హారిస్ వచ్చారు. అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్‌కు తన మద్దతు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టులో తన మద్దతును కమలకు ప్రకటించారు.
‘‘నా అమెరికా అధ్యక్ష నామినేషన్‌ను ఆమోదించకూడదని నిర్ణయం తీసుకున్నాను. నా మిగిలిన పదవీకాలానికి అధ్యక్షుడిగా ఉండి, నా పూర్తి దృష్టిని విధులపై కేటాయించాలనుకుంటున్నాను. 2020లో పార్టీ ఉపాధ్యక్షురాలి అభ్యర్థిగా కమలా హారిస్‌ను ఎంపికచేస్తూ నేను తొలి నిర్ణయం తీసుకున్నాను. అదే నా ఉత్తమ నిర్ణయం అని భావిస్తున్నాను. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఉండేందుకు ఈ రోజు నా మద్దతు ప్రకటిస్తున్నాను. డెమోక్రటిక్ నేతలందరం కలిసి ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం వచ్చింది. ఆయనను ఓడిద్దాం’’ అని బైడెన్ పేర్కొన్నారు. 59 ఏళ్ల కమలా హారిస్ డెమోక్రాట్లు అభ్యర్థిగా ఆమోదిస్తే.. అమెరికా హిస్టరీలోనే కీలక నిర్ణయం కానుంది.