నేపాల్ దేశాన్ని గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆ దేశంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల్లో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. వరద సంబంధిత మరణాలపై నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దహల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ప్రధాని పుష్ప కుమార్ ఆదేశించారు.
తూర్పు నేపాల్‌లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. చైన్‌పుర్ మున్సిపాలిటీ-4 ప్రాంతంలో హేవా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సూపర్ హేవా హైడ్రోపవర్ ప్రాజెక్టు వద్ద వరదలు సంభవించి అక్కడ పనిచేసే కార్మికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చైన్‌పుర్, పంచఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి హేవా నది ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. దీంతో వరదలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వరదలకు పలు ప్రాంతాల్లో ఇళ్లు కొట్టుకుపోయాయి.