ఉత్తర కాలిఫోర్నియాలో ఒక వ్యక్తి వల్ల మొదలైన మంటలు (ది పార్క్‌ఫైర్) అత్యంత వేగంగా వ్యాపిస్తూ.. గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూములను కాల్చిబూడిద చేస్తోంది. ఇప్పటివరకు ఈశాన్య చికోలో 3,48,000 ఎకరాలను దహనం చేసింది. కావాలని అడవికి నిప్పు పెట్టడంతో బుధవారం ఇది మొదలైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వ్యక్తి కాలిపోతున్న కారును దొర్లించడంతో మంటలు మొదలైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే 42 ఏళ్ల అనుమానితుడిని అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని బుట్టె, టెహమ్మా కౌంటీల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రకటించారు.
దాదాపు 2,500 మంది అగ్నిమాపక సిబ్బంది దీనిని ఆర్పేందుకు శ్రమిస్తున్నా మంటలు ఆరడం లేదు. ఎత్తైన కొండలు, గాలుల కారణంగా దీనిని అడ్డుకోవడం కష్టంగా మారింది. ఈ ఏడాది కాలిఫోర్నియా రాష్ట్రం ఎదుర్కొన్న అతిపెద్ద కార్చిచ్చు ఇదేనని అధికారులు తెలిపారు. ఈ మంటలు గంటకు 5,000 ఎకరాలకు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు.