చిరకాల మిత్రులు కెసీఆర్,వైఎస్ జగన్ మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది…? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది.అధికారంలో ఉండగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు రాష్ర్టాల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన నడిచింది. అయితే ఎక్కడ చెడిందో ఏమో కానీ ఈ ఇద్దరుమిత్రులు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా జరిగితే బీఆర్ఎస్ నుండి ఒక్క ఎంపీ కూడా పాల్గొనలేదు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు.
అయినా నిరసన కార్యక్రమంవైపు రాలేదు. కనీసం కేసీఆర్ లేదా కేటీఆర్‌లు కూడా ఎక్కడా జగన్ ప్రస్తావన తీసుకురావడం లేదు. జగన్‌కి మద్ధతిస్తున్నట్లు కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు. కేసీఆర్-జగన్ మధ్య స్నేహం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కేసీఆర్ ఓడిపోయాక ప్రమాదం జరిగితే స్వయంగా జగన్ వెళ్ళి పరామర్శించి వచ్చారు. మరి జగన్ ధర్నా చేస్తే కెసీఆర్ ఎందుకు మద్ధతు ఇవ్వలేదు అని చర్చలు నడుస్తున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా బిఆర్ఎస్ గెలవలేదు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇదే టైమ్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గతంలో అధికారంలో ఉండడంతో జగన్, కెసిఆర్ లు పరస్పరం రాజకీయంగా చర్చించుకున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు. బీఆర్ెస్ అధికారం కోల్పోయినా ఆయనపైగానీ, ఆయన పార్టీపైన గానీ ఎలాంటి దాడులు జరగడం లేదు. కాబట్టి కెసీఆర్‌కు అక్కడ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
ఏపీలో మాత్రం భిన్న రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ నేతలు, క్యాడర్‌పై ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. ఏరోజు ఎవరిని టార్గెట్ చేస్తారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీనిపైనే జగన్ ఢిల్లీ వేదికగా మూడే రోజుల పాటు పెద్ద ధర్నా నిర్వహించారు . ఈ ధర్నాకు ఇండి కూటమిలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.ఆ కూటమిలో జగన్ లేనప్పటికీ వారు మద్ధతు ప్రకటించారు.ఇదే సమయంలో చిరకాల మిత్రులైఉండి జగన్‌కు కెసీఆర్ ఎందుకు మద్ధతు ప్రకటించలేదని చర్చలు జోరందుకున్నాయి.జగన్ కష్టాల్లో ఉంటే అండగా నిలబడాల్సిన కేసీఆర్ పట్టించుకోపోవటంతో వీరి మధ్య గ్యాప్ వచ్చేసిందనే ప్రచారం జరుగుతోంది.
కూతురు కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేందరూ పార్టీని వదిలిపోతున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై కెసీఆర్ కామెంట్ చేయడంలేదు. అలాగని కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు కూడా ఎక్కడా లేవు. ఈ నేపథ్యంలో తొందరలోనే బీజేపీతో కెసీఆర్ పొత్తు పెట్టుకుంటారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేవిధంగా నరేంద్రమోడికి వ్యతిరేకంగా కేసీఆర్ ఏమీ మాట్లాడటంలేదు. ఇక జగన్ ధర్నా చేస్తున్న నేపథ్యంలో మద్ధతు ఇవ్వాలంటూ అందరికీ ఆహ్వానం పంపారు. అలా కెసీఆర్‌కి కూడా ఆహ్వానం అంది ఉంటుందని చెప్పొచ్చు. మద్ధతుపై కేసీఆర్ కనీసం ప్రకటన చేయకపోవడం ఆందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం మీడియాలో నడుస్తోంది. కేసీఆర్ బీజేపీ వైపు వెళ్తున్నారనే ప్రచారమూ ఉంది. ఈనేపథ్యంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఇద్దరు మిత్రుల వైఖరిపై ఎవరికి ఉండాల్సిన అనుమానాలు వారికి ఉన్నాయి. త్వరలోనే అవన్నీ క్లియర్ అవుతాయని ఆశిద్దాం