మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చిన్నారుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వేదికల్లో చిన్నారుల భద్రతపై యూఎస్ సెనెట్ విచారిస్తున్న సమయంలో మధ్యలో లేచి క్షమించమని బాధిత కుటుంబాలను కోరారు. అసలేం జరిగిందంటే?
సోషల్ మీడియా వల్ల చిన్నారులపై పడుతోన్న ప్రమాదకరమైన ప్రభావం కట్టడికి తగినన్ని చర్యలు తీసుకోవడం లేదంటూ తల్లిదండ్రుల ఫిర్యాదుతో యూఎస్ సెనెట్ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఈ విచారణకు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్తో పాటు టిక్‌టాక్, ఎక్స్ (ట్విటర్), డిస్కార్డ్, స్నాప్‌చాట్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. చట్టసభ సభ్యులు జుకర్‌బర్గ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ చేతులకు రక్తం అంటుకొని ఉంది’ అంటూ ఆ సంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదంతా చూసిన మెటా సీఈఓ తన సీటు నుంచి లేచి బాధిత చిన్నారుల తల్లిదండ్రుల వైపు చూస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘మీరు అనుభవించిన బాధ ఎవరికీ రాకూడదు’ అంటూ వారికి క్షమాపణలు చెప్పారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమాలపై ఆత్మహత్య, ఈటింగ్ డిజార్డర్‌ను చర్చించే సమాచారంపై ఆంక్షలను కఠినతరం చేసినట్లు వెల్లడించారు.