ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య యుద్ధం ఎంతో మంది సామాన్య పౌరుల ప్రాణాలు బలి తీసుకుంటోందని ఐక్య రాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనాలకు మద్దతు పలుకుతున్న దేశాలు కూడా పౌరులపై దాడులను ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యం ఇజ్రాయెల్-గాజా ఘర్షణలపై తాజాగా బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ శుక్రవారం రోజునప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాల్సిన ఆవశ్యకతను ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్-గాజా ఘర్షణల్లో పౌరుల రక్షించాల్సిన అవసరం ఉందని.. పశ్చిమాసియాలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ఇరు దేశాల అధినేతలు ముక్త కంఠంతో ఖండించినట్లు తెలిసింది.
మరోవైపు ద్వైపాక్షిక సంబంధాలపై కూడా మోదీ-సునాక్ మాట్లాడినట్లు బ్రిటన్ అధికారులు తెలిపారు. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో పురోగతిని కూడా సమీక్షించారని వెల్లడించారు. ప్రపంచ కప్ క్రికెట్‌లో భారత టీమ్ సాధిస్తున్న విజయాలను రిషి సునాక్ అభినందిస్తూ మోదీకి కంగ్రాట్స్ తెలిపారని చెప్పారు.