న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్‌ బిల్‌బోర్డుపై మోదీ ఫొటోలు

-

అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన టైమ్స్‌స్క్వేర్‌ వద్ద బిల్‌బోర్డులపై మోదీ ఫొటోలను ప్రదర్శించారు. దీంతోపాటు ఆయనకు స్వాగతం పలుకుతున్న సందేశాలతో ఇక్కడ ఇండో-అమెరికన్లు సందడి చేశారు. చారిత్రక అధికారిక పర్యటనకు భవ్య స్వాగతం అవసరమని ఆ బిల్‌బోర్డులు చెబుతున్నాయని ‘ది యూఎస్‌-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌’ పేర్కొంది.

న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రపంచంలోని అత్యధిక దేశస్థులు పాల్గొన్న కార్యక్రమంగా గిన్నిస్‌ బుక్‌లోనూ చోటు సంపాదించింది. ‘యోగా భారత్‌కు చెందిన అతిపురాతనమైన సంప్రదాయ ప్రక్రియ. దీనికి కాపీరైట్లు, పేటెంట్లు, రాయల్టీలు లేవు’ అని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

ఈసారి మోదీ పర్యటన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ అధికారిక ఆహ్వానంపై జరుగుతోంది. భారత్‌-అమెరికా సంబంధాలను ఈ పర్యటన మరింత ఉన్నత శిఖరాలకు చేర్చనుందని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version