కొండచరియలు విరిగిపడి ఓ గ్రామమే నామరూపాల్లేకుండా ధ్వంసమైంది. ఇక అందులో నివసించే వారిలో 100 మంది నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఈరోజు వేకువజామున పపువా న్యూ గినియాలో చోటుచేసుకుంది. దేశ రాజధాని పోర్ట్ మోరెస్టీకి 600 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలో శుక్రవారం వేకువజామున 3గంటలకు ఈ ఘటన జరిగింది.
రంగంలోకి దిగిన సహాయక బృందాలు, గ్రామస్థులు మృతదేహాలను వెలికితీస్తున్నారని ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(మీడియా) తెలిపింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్యను పపువా న్యూ గినియా అధికారులు ధ్రువీకరించలేదు. మృతుల సంఖ్య 100 కంటే ఎక్కువ ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు. కొండచరియలు విరిగిపడడం వల్ల తన కుటుంబంలోని నలుగురు మృతి చెందారని ఓ విద్యార్థి కన్నీరుమున్నీరుగా విలపించాడు. అయితే వీరంతా నిద్రలో ఉండగానే ఈ ఘటన జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పోర్గెరా ఉమెన్ ఇన్ బిజినెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ లారుమా కోరారు.