మోడీకి ఆస్ట్రేలియా మీడియా చుర‌క‌లు.. ఇండియాను వైర‌స్ విధ్వంసంలోకి తీసుకెళ్లార‌ని వ్యాఖ్య‌..

-

భార‌త్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ అంత‌కంత‌కూ పెరుగుతుండ‌డంతో ప్ర‌ధాని మోదీకి అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌వుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని, మే నెల‌లో రోజుకు 4 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంద‌ని సైంటిస్టులు ముందే హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ మోదీ ప‌ట్టించుకోలేద‌ని, పైగా కుంభ‌మేళా, ఎన్నిక‌ల ద్వారా వైర‌స్‌ను న‌లు దిశ‌లా వ్యాప్తి చేశార‌ని ఇప్ప‌టికే చాలా మంది విమ‌ర్శిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ది ఆస్ట్రేలియన్ అనే ప‌త్రిక కూడా మోదీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది.

ప్ర‌ధాని మోదీకి అహంకారం ఎక్కువ‌ని, ఆయ‌న చేసిన ప‌నుల వ‌ల్లే భార‌త్ నేడు ఈ దుస్థితిలో ఉంద‌ని, ఆయ‌న ఇండియాలో లాక్‌డౌన్‌ను తీసేసి ఇండియాను వైర‌స్ విధ్వంసంలోకి తీసుకెళ్లార‌ని, అందువ‌ల్లే కోవిడ్ విజృంభిస్తోంద‌ని ది ఆస్ట్రేలియ‌న్ వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు ఆ సంస్థ ట్వీట్ చేసింది.

అయితే ది ఆస్ట్రేలియ‌న్ ప్ర‌క‌టించిన అభిప్రాయంపై ఆస్ట్రేలియాలో ఉన్న భార‌త హై క‌మిష‌న్ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు భార‌త హై క‌మిష‌న్ ట్వీట్ చేసింది. ది ఆస్ట్రేలియ‌న్ చేసిన వ్యాఖ్య‌లు అర్థ ర‌హిత‌మ‌ని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని సూచించింది. భార‌త హైక‌మిష‌న్ ఇందులో భాగంగానే ఓ లేఖ‌ను కూడా విడుద‌ల చేసింది.

అయితే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇప్ప‌టికే లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. అనేక మంది నిపుణులు, విదేశీ సైంటిస్టులు కూడా భార‌త్ లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధించాల‌ని అంటున్నారు. కానీ దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version