మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (71) పార్టీ పీటీఐపై (పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్) త్వరలో నిషేధం విధించనున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. దేశద్రోహానికి, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతోనే ఈ చర్య తీసుకోనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడంతోపాటు అల్లర్లకు ప్రేరేపించిందనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని, అందుకే చర్యలు తీసుకుంటున్నామని సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ చెప్పారు. ఇప్పటికే నిషేధ చర్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
పాకిస్థాన్ ప్రభుత్వ ప్రకటనతో పీటీఐ పార్టీ ప్రతినిధులు భగ్గుమన్నారు. పాకిస్థాన్ జాతీయ, నాలుగు ప్రాంతీయ అసెంబ్లీల్లో మహిళలు, మైనారిటీలకు రిజర్వు చేసిన సీట్లకు పీటీఐకి అర్హత ఉందని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులివ్వగా.. అదే జరిగితే 109 సీట్లతో జాతీయ అసెంబ్లీలో పీటీఐ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని పీటీఐ ప్రతినిధులు తెలిపారు. దీంతో నిరాశకు గురైన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించిందని మండిపడ్డారు.
పీటీఐపై నిషేధం విధించనున్నామని ప్రభుత్వం ప్రకటించడంపై హతాశులయ్యామని పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యానించింది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.